సోమవారం, 6 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (14:31 IST)

మెగాస్టార్ "రుద్రవీణ"కు 33 సంవత్సరాలు

లెజెండ్ దర్శకుడు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ఆణిముత్యంల్లాంటి సినిమా రుద్రవీణ. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శోభన హీరోయిన్‌గా నటించింది. కమర్షియల్ పరంగా పెద్ద హిట్ సాధించలేదు. కానీ, జాతీయ స్థాయిలో అందరి ప్రశంసలు అందుకుంది. చిరంజీవికి ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. ఉత్తమ జాతీయ చిత్రంగా కూడా నిలిచింది. ఈ చిత్రం మార్చి 4వ తేదీకి రిలీజై 33 యేళ్లు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం ఓ హైలెట్. 
 
సంగీత ప్రావీణ్యుడైన గణపతి శాస్త్రి (జెమిని గణేశన్)కి గౌరవప్రథమైన బిళహరి బిరుదు ఉంటుంది. గణపతి శాస్త్రికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద కుమారుడు (ప్రసాద్ బాబు) మూగవాడు, కానీ సన్నాయి నాదంలో దిట్ట. చిన్న కుమారుడు సూర్యనారాయణ శాస్త్రి (చిరంజీవి). తండ్రి వద్దే సంగీతంలో శిక్షణ పొందుతున్నప్పటికీ అభినవ భావాలు గల వ్యక్తి. కుమార్తె తంబూరా వాయిద్యంలో ప్రావీణ్యురాలు.
 
లలిత శివజ్యోతి (శోభన) నాట్యంలో ప్రావీణ్యం ఉన్నా, కేవలం అధమ సామాజిక వర్గానికి చెందినది కావటం వలన, గుడిలోకి తన ప్రవేశం నిషిద్ధం కావటం వలన, గుడికి దూరంగా, కొండపై నటనమాడుతూ ఉంటుంది. లలిత నాట్యానికి ముగ్ధుడైన సూర్యం తనతో పరిచయం పెంచుకొంటాడు. లలితకు జరుగుతోన్న అన్యాయానికి బాధ పడతాడు. లలిత తండ్రి (పి.ఎల్.నారాయణ) ఒక లాయరు.
 
ఒకరోజు తండ్రితో కలిసి సాధన చేస్తున్న సూర్యానికి తలుపు వద్ద ఒక స్త్రీ భిక్షాటన వినిపిస్తుంది. ఆ భిక్షగత్తె దీన గళంతో ఏకాగ్రతని కోల్పోయిన సూర్యాన్ని మందలిస్తాడు గణపతి శాస్త్రి. తర్వాత జరిగే సంగీత కచేరీలో "మానవ సేవే మాధవ సేవ" అని అర్థం వచ్చేలా సూర్యం పాడుతాడు. ఇది గణపతి శాస్త్రికి ఆగ్రహం తెప్పిస్తుంది. 
 
చారుకేశ (రమేష్ అరవింద్) అనే మరో యువకుడిని శిష్యునిగా స్వీకరిస్తాడు. తండ్రి ధిక్కరింపుకు గురైన సూర్యం, లలిత ఇంటిలో తలదాచుకొంటాడు. తన కూతురినే ప్రేమించటం హర్షించిన గణపతి శాస్త్రిని చారుకేశ వరకట్నంగా తన బిళహరి బిరుదుని ఇవ్వమంటాడు. చేసేది లేక ఇచ్చిన గణపతి శాస్త్రికి తర్వాత చారుకేశ అసలు బ్రాహ్మణుడే కాదని తెలుస్తుంది.
 
ఇల్లు వదలి సమాజసేవ బాటని పట్టిన సూర్యం సంఘ సంక్షేమ ప్రయత్నాలని గుర్తించి ప్రధాన మంత్రి అతనిని సత్కరించటానికి తమ ఊరికి వస్తున్నాడని గణపతి శాస్త్రికి తెలుస్తుంది. ఆ సభలో కుమారుడిని దగ్గర నుండి చూడాలన్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవటం గమనించిన సూర్యం అతను తన తండ్రి అని, సభా వేదిక పై అతనిని తీసుకు వచ్చి, తండ్రిగా అతనిని సత్కరించటంతో చిత్రం సుఖాంతమౌతుంది.