బుధవారం, 27 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (16:13 IST)

ప్రతీ ఒక్కరి నుండి స్పూర్తి పొందిందే గమనం - దర్శకురాలు సంజనా రావు

Sanjana Rao
జీవిత ప్రయాణం గురించి చెప్పడమే గమనం. ప్రతీ ఒక్క పాత్రకు ఓ జర్నీ ఉంటుంది. అదే `గమనం`లో ఆవిష్క‌రించానని దర్శకురాలుగా పరిచయం కాబోతోన్న సంజనా రావు అన్నారు. శ్రియా సరన్, శివ కందుకూరి, ప్రియాంక జవాల్కర్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలను పోషించారు. గమనం సినిమాను డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకురాలు సంజన రావ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు
 
ఈ సినిమా కథ సడెన్‌గా పుట్టిందేమీ కాదు. నా చిన్నప్పటి నుంచి చూస్తూ వచ్చిన సంఘటనలన్నీ ఇందులో ఉంటాయి. నా చిన్నతనంలో చెరువు ఉండేది. కొన్నేళ్ల తరువాత అది గ్రౌండ్‌గా మారింది. ఆ తరువాత అక్కడ బిల్డింగ్‌లు వచ్చాయి. అలాంటి చిన్నప్పటి నుంచి కొన్ని చూస్తూ వచ్చాను. అవన్నీ కూడా నా బ్రెయిన్‌లో ఫీడ్ అవుతున్నాయి. 2018లో ఓ కథ అనుకున్నాను. కానీ అలాంటి సినిమాను కాదు నేను తీయాల్సింది అని అనుకున్నాను. అలా ఓ రాత్రి ఈ సినిమా పాయింట్ తట్టింది.
 
ఇందులో మూడు నాలుగు కథలుంటాయని కాదు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉండే లైఫ్ సర్కిల్‌ను చూపించాలని అనుకున్నాను.
 
శ్రియా సరన్, చారు హాసన్ వంటి సీనియర్ నటీనటులతో పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. మనం ఎన్నో అనుకుంటాం. కానీ పాత్రకు జీవం పోసేది మాత్రం నటీనటులే. చారు హాసన్ మాత్రం ఎంతో కష్టపడి చేశారు. ఆయనే ఇంకో టేక్ తీసుకోండని అనేవారు. శ్రియా సరన్ మాత్రం చాలా కొత్తగా కనిపిస్తారు. ప్రతీ ఒక్కరూ ఆమెతో ప్రేమలో పడిపోతారు.
 
స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు ఈ పాత్రలకు వీరు ఆ పాత్రలకు వారు అని ఎవ్వరినీ అనుకోలేదు. శ్రియా వద్దకి వెళ్లే వరకు కూడా నా కమల ఆమె అని తెలియదు. సగం కథను చెప్పిన తరువాత ఆమె నా కమల అని ఫిక్స్ అయ్యాను. కథ చెప్పడం పూర్తయ్యాక శ్రియా అలా లేచి ఏడ్చేశారు. గట్టిగా హత్తుకున్నారు.
 
గమనం కథను ఓ డ్రాఫ్ట్‌లా రాసుకున్నప్పుడు నిర్మాత జ్ఞానశేఖర్ గారికి పంపాను. ఆయనకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమా తీయాలనే అనుకుంటున్నాను అని అన్నారు. మొదట ఈ చిత్రాన్ని చిన్నగానే తీయాలని అనుకున్నాం. కానీ పెద్ద సినిమాగా మారిపోయింది.
 
మా చిత్రానికి క్రిష్ గారి సపోర్ట్ ఎప్పుడూ ఉంది. ప్రాజెక్ట్ పరంగా మాత్రం ఎలాంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు.
 
మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇళయరాజా కావాలని అనడంతో నిర్మాతలు షాక్ అయ్యారు. ఒక్కసారి మీటింగ్ ఏర్పాటు చేయండని అడిగాను. ఒక్కసారి ఆయన్ను కలవాలని అనుకున్నాను. ఓ దేవుడిని చూడబోతోన్నాననే ఫీలింగ్ వచ్చింది. కథ చెబుతూ ఉన్నాను.. హే ఆపు అని అన్నారు. నేను షాక్ అయ్యాను. నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఓ ఫోటో తీయండి.. మేం సినిమా చేయబోతోన్నామని ఇళయరాజా గారు అన్నారు. సినిమా ఆర్ఆర్ చాలా అద్భుతంగా వచ్చింది.
 
సాయి మాధవ్ గారు సినిమా ఒప్పుకుని చేసినందుకు చాలా థ్యాంక్స్. నేను ఎప్పుడూ ఏ కథ రాసినా కూడా సాయి మాధవ్ గారికి చెబుతుంటాను. ఆయనకు ఆ సహనం ఉంది. తప్పొప్పులు చెబుతుంటారు. ఈ కథ చెప్పడంతోనే చేద్దామని అన్నారు. ఇందులో కొన్ని డైలాగ్సే ఉంటాయి. తక్కువ మాటలే ఉన్నప్పుడు అవి ఎంతో ప్రాముఖ్యత ఉంటాయి.
 
సినిమా ఇండస్ట్రీలోకి రావాలని ఉందనే కోరికను ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. మా నాన్నతో పాటు షూటింగ్‌లకు వెళ్లినప్పుడు హీరో హీరోయిన్లను చూశాను. అక్కడ ఎవరు ఏం చేయాలో చెప్పేది దర్శకుడే. అప్పుడే డైరెక్టర్ అవ్వాలని అనుకున్నాను.  
 
నిత్య మీనన్ గారికి ఈ కథ తెలుసు. ఓ క్యారెక్టర్ చేయాలని ఆమెను అడిగాం. వెంటనే ఓకే చెప్పారు. ఎప్పుడు రావాలో చెప్పండని అన్నారు. అలా చెప్పగానే వచ్చారు. కారెక్టర్ చేశారు.
 
జ్ఞానశేఖర్ గారు తీసిన కొన్ని షాట్స్ చూసి ఇళయరాజా గారు షాక్ అయ్యారు. మొత్తం నీళ్లు ఉంటే ఎలా షూట్ చేశారు. లైటింగ్ ఎక్కడ పెట్టారంటూ అడిగేశారు. అసలు లైట్స్ లేకుండా ఆ సీన్స్ తీశారు.
 
ఎన్నో డాక్యుమెంటరీలను తీశాను. నాకు జనాలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం. నా జీవితంలో కలిసి ప్రతీ ఒక్కరి నుంచి స్పూర్తి పొంది ఈ కథను రాశాను. పైగా నేను ఉమ్మడి కుటుంబంలో పెరిగాను. నేను చిన్నప్పటి నుంచి చూసిన కథలన్నీ చెప్పాలని అనుకున్నాను.
 
మనం కథ చెప్పడం ముఖ్యం. అది కమర్షియల్‌గా చెప్పాలా? వేరే జానర్‌లో చెప్పాలా? అని ఆలోచించం. మనసుకు హత్తుకునేలా చెప్పాలని అనుకుంటాం. శివ కందుకూరి క్రికెటర్ అవ్వాలని అనుకునే అలీ అనే కుర్రాడి పాత్రలో కనిపిస్తారు. అతడిని ప్రేమించే అమ్మాయిగా ప్రియాంక జవాల్కర్ కనిపిస్తారు.
 
సినిమాను తీయడానికి డాక్యుమెంటరీ తీయడానికి చాలా తేడా ఉంటుంది. కానీ చెప్పే విషయంలో మాత్రం తేడా ఉండదు. ఏ ఎమోషనల్ రాబట్టాలని అనుకుంటామో దాంట్లో ఏమీ మార్పు ఉండదు. కాకపోతే సినిమా అని భయపడతాం. కానీ సెట్‌కు వెళ్లాక అంతా మర్చిపోతాం.
 
సినిమా విడుదల కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఉన్నాను. ప్రస్తుతం ఓ స్క్రిప్ట్ పూర్తయింది.