శనివారం, 5 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 30 మార్చి 2023 (18:19 IST)

మణిరత్నం చూసి అసూయపడుతున్నా : కమల్ హాసన్

kamal haasan
దర్శకుడు మణిరత్నంను చూసి తాను అసూయ చెందుతున్నట్టు విశ్వనటుడు కమల్ హాసన్ అన్నారు. మణిరత్నం తెరకెక్కించిన చిత్రం పొన్నియిన్ సెల్వన్ రెండో భాగం వచ్చే నెల 28వ తేదీన విడుదల కానుంది. దీన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నైలో ఆ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో ముఖ్య అతిథిగా కమల్ హాసన్, మరో నటుడు శింబులు పాల్గొన్నారు.

ఇందులో కమల్ హాసన్ మాట్లాడుతూ, అందరి లాగే తానూ పొన్నియిన్‌ సెల్వన్‌ 2 కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి చిత్రంలో తాను కూడా భాగం కావాలని భావించి ఈ సినిమాకు వాయిస్‌ ఓవర్‌ ఇచ్చినట్లు తెలిపారు. ఇలాంటి గొప్ప సినిమాలో అవకాశాన్ని కోల్పోకూడదని అనుకున్నా. అందుకే వాయిస్‌ ఓవర్‌ ఇచ్చి ఇందులో భాగమయ్యాను అని వివరణ ఇచ్చారు. 
 
తనకు మణిరత్నాన్ని చూస్తే చాలా అసూయగా ఉంటుందన్నారు. అసలు ఇంత గొప్ప ఆలోచనలు ఆయనకు ఎలా వస్తాయో తనకు అర్థం కాదన్నారు.  సినిమా ఎలా ఉండనుందనే విషయం ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుందన్నారు. ఇటీవల ఈ సినిమాలోని పాటలను విన్నాను. వాటిని వర్ణించడానికి నాకు మాటలు కూడా రావడం లేదు.. అంత అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. సినిమా రంగంలో అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి అంటూ కమల్ హాసన్ సూచించారు.