గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 17 ఆగస్టు 2018 (17:54 IST)

కేరళ వరదలు... ప్రభాస్, కొరటాల శివ విరాళాలు...

ప్రకృతి సృష్టించిన వరద బీభత్సానికి కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ త

ప్రకృతి సృష్టించిన వరద బీభత్సానికి కేరళ రాష్ట్రం విలవిలలాడుతోంది. ఈ నేపధ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ కోటి రూపాయల విరాళాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చారు. తాజాగా దర్శకుడు కొరటాల శివ తనవంతు సాయంగా రూ. 3 లక్షల సాయాన్ని అందించారు. కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి సూర్య, కార్తీలు కూడా రూ. 25 లక్షలు అందజేశారు.
 
గత 100 ఏళ్లలో ఎన్నడూ ఎరుగని వరద బీభత్సం కేరళ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఇప్పటివరకూ 324 మంది మృత్యువాత పడగా సుమారు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఎక్కడ చూసిన వరద తాకిడితో ఛిద్రమైన ఇళ్లు కనిపిస్తున్నాయి. గురువారం ఒక్కరోజే 106 మంది మృత్యువాతపడ్డారు. మరోవైపు రోగులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రాధమిక చికిత్స కోసం అవసరమైన మందులు దొరకక రోగులు ఇక్కట్లు పడుతున్నారు. 
 
జాతీయ విపత్తు బృందం రంగంలోకి దిగి హుటాహుటిన సహాయక చర్యలు చేపడుతోంది. విరిగి పడిన కొండ చరియలను తొలగిస్తూ శిథిలాల క్రింది చిక్కుకున్నవారిని రక్షిస్తోంది. వరద తాకిడికి కొట్టుకుపోయిన రోడ్ల మరమ్మత్తులను యుద్ధప్రాతిపదికన చేపడుతోంది. 
 
సహాయక చర్యల్లో భాగంగా నౌకాదళ హెలికాప్టర్ నుంచి ఓ మహిళ జారిపడింది. ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరుగగా మిగిలిన సహాయక చర్యల పనితీరునంతటినీ వదిలేసి పలు మీడియా ఛానళ్లు ఆ సంఘటననే చూపించడంపై విమర్శలు వచ్చాయి. కాగా హెలికాప్టర్ నుంచి జారిపడిన సదరు మహిళ గర్భవతి. ఆమెను నౌకాదళ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె అక్కడే ప్రసవించింది. తల్లీబిడ్డ క్షేమంగా వుండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 
 
ఇకపోతే కేరళలో తలెత్తిన ప్రకృతి బీభత్సం, అది సృష్టించిన భారీ నష్టాన్ని చూసేందుకు ప్రధానమంత్రి శుక్రవారం రాత్రి కేరళ చేరుకుంటున్నారు. శనివారం నాడు ఏరియల్ సర్వే చేయనున్నారు. కేంద్రం ఇప్పటికే రూ. 100 కోట్ల సాయం ప్రకటించింది. ఇంకా మరింత సాయం అందించాల్సిందిగా కేంద్రాన్ని కేరళ రాష్ట్ర ప్రభుత్వం అర్థించింది.