మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 17 ఆగస్టు 2018 (17:41 IST)

కేరళ వరదలు 167కి పెరిగిన మృతుల సంఖ్య.. వారం పాటు ఉచిత కాల్స్

కేరళ వరదలు బీభత్సం సృష్టించాయి. కేరళ వరదల కారణంగా.. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వేలాది ఇళ్ళు నేల

కేరళ వరదలు బీభత్సం సృష్టించాయి. కేరళ వరదల కారణంగా.. జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు, వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వేలాది ఇళ్ళు నేలమట్టం కావటంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు.


రహదారులు దెబ్బతిన్నాయి. సహాయక చర్యలకు సైతం కురుస్తున్న వర్షాలు ఆటంకం కలిగిస్తున్నాయి. 13 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం కేరళలో ఎన్డీఆర్‌ఎఫ్, ఇండియన్ కోస్ట్‌గార్డ్, భారత సైన్యం, వాయుసేన దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
 
పదిరోజులుగా కేరళ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. వరదల కారణంగా చోటుచేసుకున్న మరణాల సంఖ్య 167కు పెరిగిందని సీఎం పినరయి విజయన్‌ శుక్రవారం వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పునరావస శిబిరాల్లో 2.23 లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. 
 
ఇదిలా ఉంటే.. వరదలతో అతలాకుతలం అయిన కేరళకు తమ వంతు సాయం అందిస్తున్నాయి వివిధ టెలికాం సంస్థలు. వారం రోజులపాటు ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఉచిత కాల్స్‌, డాటా సేవలను అందిస్తున్నట్టు రిలయెన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌లు ప్రకటించాయి. అలాగే పోస్ట్‌పె​యిడ్‌ కస్టమర్లు చెల్లించాల్సిన బిల్లులకు గడువు తేదీని పెంచినట్టు టెలికాం సంస్థలు ప్రకటించాయి. 
 
ఎయిర్‌ టెల్‌ తనవంతుగా 30 రూపాయల టాక్‌టైమ్‌.. వారం రోజులపాటు 1 జీబీ డాటా ప్రకటించింది. అంతేకాదు వరదలతో విద్యుత్ సరఫరా లేక ఇబ్బందిపడుతున్న ప్రాంతాలకు తమ ఎయిర్టెల్ స్టోర్లలో మొబైల్ ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని ఎయిర్‌టెల్ తెలిపింది.