సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 జులై 2024 (18:27 IST)

మన మనసు ఒక స్టీరింగ్ వంటిది... లక్ష్యం దిశగానే వెళ్లాలి : హీరో సూర్య

suryaa
మన మనసు ఒక స్టీరింగ్ వంటిందని, దాన్ని లక్ష్యం దిశగానే తీసుకెళ్లాలని హీరో సూర్య అన్నారు. తాను స్థాపించి అగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్లస్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి కాలేజీ విద్యను అభ్యసిస్తున్న ఫస్ట్ జనరేషన్ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో హీరోలు సూర్య, కార్తీలతో పాటు వారి తండ్రి శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఇందులో హీరో సూర్య మాట్లాడుతూ, పేదపిల్లలకి ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందించడమే లక్ష్యంగా కొన్నేళ్ల క్రితం ఈ చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. జీవితానికి సంబంధించి విద్యార్థులు కలలు కనాలని.. వాటిని నెరవేర్చుకోవడానికి అన్నివిధాలుగా శ్రమించాలన్నారు. 
 
'మన మనసు ఒక స్టీరింగ్‌ లాంటిది. గోల్‌ వైపు అది మళ్లే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే. స్కూల్‌ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు. చదువు పూర్తైన తర్వాత గార్మెంట్‌ పరిశ్రమలో పనిచేశా. రూ.1200 జీతం. ఆ ఉద్యోగం నచ్చలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేశా. ఆ సమయంలో జీవితంలో యూటర్న్‌ తీసుకున్నా. నటుడిగా మారాలని నిర్ణయించుకున్నా. 
 
షూటింగ్‌కు ఐదు రోజులు ముందు వరకూ నటుడిని అవుతున్నా అంటే నమ్మలేదు. ‘నేరుక్కు నేర్‌’ అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. విజయ్‌ హీరోగా మణిరత్నం ఆ చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా విడుదలయ్యాక వచ్చిన ప్రశంసలు, ప్రేమాభిమానాలు చూసి.. వాటికి అర్హుడినేనా అని ఆలోచించా. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయాలని నిర్ణయించుకున్నా. నేడు ఈ స్థాయికి వచ్చా. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నా. కష్టపడితే మీరు తప్పకుండా సాధిస్తారు' అని ఆయన చెప్పారు.