ఆ హీరోలకు మర్చిపోలేని హిట్ ఇచ్చిన కొరటాల
సినిమారంగంలో దశాబ్దంపాటు రచయితగా పలు విజయవంతమైన సినిమాలకు పనిచేసిన కొరటాల శివ పుట్టినరోజు ఈరోజే. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు. ఆయన బావ పోసాని దగ్గర ఎక్కవ కాలం రచయితగా పనిచేశాడు. బోయపాటి తెరకెక్కించిన `సింహా`కూ ఆయనే రచయిత. కమ్యూనిస్టుల కుటుంబానికి చెందిన వ్యక్తి. సాహిత్యంపై పట్టు వుంది. శ్రీశ్రీ రచనలు అంటే ఆయనకు మరింత ఇష్టం. చాలా నవలలు, సాహిత్యాలు, కవితలు అవపోసన పట్టారు. ఇంజనీర్ అయిన ఆయన సినిమారంగంలో ఆసక్తితో వచ్చాడు. అయితే తొలిసారిగా ఆయన దర్శకుడిగా మారింది 2013లో ప్రభాస్ `మిర్చి`తోనే. కథలో ఫ్యాక్షనిజం హత్యలు ఎన్ని వున్నా దాన్ని సందేశాత్మకంగా తీసి మెప్పించాడు. బాహుబలికి ముందు తక్కువ సమయంలో ఈ సినిమా పూర్తిచేశాడు.
`రెబల్` ప్లాప్‌లో వున్న ప్రభాస్ కు మిర్చి విజయాన్ని ఇచ్చాడు. అదే తరహాలో మహేస్‌బాబుకు `ఆగడు` ఆశించిన ఫలితం దక్కలేదు. దాంతో `శ్రీమంతుడు`తో మహేష్ మంచి విజయాన్ని కట్టబెట్టాడు. ఊరి దత్తత అంశాన్ని తీసుకుని సందేశాత్మకంగా మలిచాడు. ఈ స్పూర్తితోనే మహేష్‌కూడా ఆంధ్ర, తెలంగాణలో రెండు గ్రామాలను దత్తత తీసుకుని సేవ చేస్తున్నాడు. అనంతరం ఎన్.టి.ఆర్. జూనియర్‌తో `జనతాగేరేజ్` అనే సినిమా తీసి మెప్పించాడు. మహేష్‌బాబుతో `భరత్ అనే నేను` సినిమాతో మరో విజయాన్ని అందించారు. 8 ఏళ్ళతో చేసింది నాలుగు సినిమాలయినా మర్చిపోలేనివిగా ఆయన కెరీర్‌లో వున్నాయి. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా కరోనా వల్ల వాయిదా పడింది. ఇంకా పదిరోజులు షూట్ మాత్రమే. అన్నీ అనుకూలిస్తే దసరాకు విడుదలచేసే ప్లాన్‌లో వున్నాడు.
ఎన్.టి.ఆర్.తో పాన్ ఇండియా మూవీ
కొరటాల శివ పుట్టినరోజు సందర్భంగా ఎన్.టి.ఆర్., చరణ్, మహేష్, ప్రభాస్ శుభాకాంక్షలు తెలియజేశారు. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తిత్వం అరుదు. అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు అయిన కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎన్‌టి.ఆర్. ట్వీట్ చేశారు. మరోసారి ఎన్.టి.ఆర్.తో సినిమా చేయబోతున్నాడు కొరటాల శివ. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధమయిన ఈ సినిమా త్వరలో సెట్‌పైకి తీసుకెళ్ళనున్నారు. పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కబోతోంది. ఇందులో కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.