సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 15 నవంబరు 2017 (09:34 IST)

ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట... లక్ష్మీపార్వతి శపథం

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 'ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట'.. అంటూ ఆమె గర్జించారు. ముఖ్యంగా లక్ష్మీస్ వీరగ్రంథం (ఆదర్శగృహిణి) అనే పేర

ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. 'ఏ గాడిద కొడుకును వదిలిపెట్ట'.. అంటూ ఆమె గర్జించారు. ముఖ్యంగా లక్ష్మీస్ వీరగ్రంథం (ఆదర్శగృహిణి) అనే పేరుతో ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని తీస్తున్న దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిపై ఆమె మండిపడ్డారు. 
 
తన అనుమతి లేకుండా సినిమా తీస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు పక్కన తనకు సంబంధం లేని వ్యక్తి పేరు పెట్టి సినిమా తీయడం, ఎన్టీఆర్‌ను అవమానించడమేనన్నారు. సినిమా నిర్మాతపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. ఎన్టీఆర్ సమాధి వద్ద షూటింగ్ చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధిపై పాలు పోసి శుద్ధి చేశారు. 
 
మరోవైపు, ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ సినిమా షూటింగ్‌‌కు తొలిరోజే అడ్డంకి ఎదురైన విషయం తెల్సిందే. హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ సినిమా షూటింగ్ ‌ చిత్రయూనిట్ ఆరంభించింది. అయితే చిత్రయూనిట్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద సినిమా చిత్రీకరణకు అనుమతి లేదని వారు అభ్యంతరం తెలిపారు. దీంతో తాను అనుమతి తీసుకున్నానంటూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. 
 
కాగా, అనుమతి పత్రంలో సినిమా పేరు, దానికి సంబంధించిన వివరాలు లేవంటూ షూటింగ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మప్రబోధం మేరకు సినిమా తీస్తున్నామని అన్నారు. తమ సినిమాకు లక్ష్మీ పార్వతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని సూచించారు. లేని పక్షంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లా కేంద్రాలకు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేయించి, ఆమె నిజస్వరూపం బయటపెడతామని హెచ్చరించారు. తానేమీ లక్ష్మీ పార్వతి బయోపిక్ తీస్తానని ఎక్కడా చెప్పలేదని, దానిపై లక్ష్మీ పార్వతికి అభ్యంతరం ఏంటని అడిగారు.
 
తాను 'లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమాను చంద్రబాబు కోణంలోంచి తీస్తున్నానని ఆయన చెప్పారు. తన సినిమా పూర్తయిన తరువాత, అది చూసిన తరువాత లక్ష్మీ పార్వతికి ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో చూసుకోవాలని సూచించారు. తాను కూడా కోర్టులోనే తేల్చుకుంటానని ఆయన తెలిపారు.