సినీ నటి హేమకు ఊరట... తొలి తప్పిదంగా భావించి వదిలేశారు..
తెలుగు సినీ నటి హేమకు ఊరట లభించింది. మూవీ ఆర్టిస్ట్స్ అసోయేషన్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను తొలి తప్పిదంగా భావించి వదిలిశారు. హేమ ఇటీవల మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చి టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టింది. అందులో మా అధ్యక్షుడు నరేష్‌పై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆరోపించారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో వివాదానికి కారణమైన సినీ నటి హేమకు ఊరట లభించింది. ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలను క్రమశిక్షణ సంఘం తీవ్రంగా పరిగణించినప్పటికీ తొలి తప్పిదంగా హెచ్చరించి వదిలేసినట్టు సమాచారం.
మా అధ్యక్షుడు నరేష్ నిధులను దుబారా చేస్తున్నారని, రూ.5 కోట్లలో రూ.3 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. నరేష్ హాయిగా ఇంట్లో కూర్చుని ఖాతాలోని డబ్బులను ఖర్చు చేస్తున్నారని హేమ విరుచుకుపడ్డారు. హేమ ఆడియో కలకలం రేపడంతో ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ అధ్యక్షుడు నరేష్, కార్యదర్శి జీవితా రాజశేఖర్ క్రమశిక్షణ సంఘానికి (డీఆర్‌సీ) ఫిర్యాదు చేశారు.
దీంతో ఆమెకు నోటీసులు జారీ చేసిన డీఆర్‌సీ మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని హేమను కోరింది. హేమ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన డీఆర్‌సీ మొదటి తప్పుగా హెచ్చరించి ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకుండానే వదిలిపెట్టింది. మరోసారి ఇలా జరిగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.