సోమవారం, 25 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Modified: మంగళవారం, 7 నవంబరు 2023 (17:50 IST)

ప్రిన్స్ మహేష్ 'గుంటూరు కారం' 'దమ్ మసాలా' దీపావళి టపాసు

Mahesh Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు, దిగ్గజ రచయిత-దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ 13 ఏళ్ళ విరామం తర్వాత 'గుంటూరు కారం'తో కలిసి వస్తున్నారు. గతంలో వారు 'అతడు', ఖలేజా, వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాలను అందించారు. వీరి కలయికలో మరో చిరస్మరణీయ చిత్రం వస్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత విజయవంతమైన నిర్మాత ఎస్.రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ ని మూడోసారి చేతుల కలిపేలా చేసిన ఘనత నిర్మాత రాధాకృష్ణ దే. ఈ కలయికలో సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి, అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్లు కావాలంటూ పదే పదే కోరుతున్నారు.
 
షూటింగ్ ఎప్పుడు జరుగుతోంది, సినిమా ఎలా రూపొందుతోంది మరియు ఎలాంటి పాటలు కంపోజ్ చేస్తున్నారు, ఇలా సినిమా గురించి ప్రతిదీ తెలుసుకోవాలనుకున్నారు. రూమర్‌లను అరికట్టడంలో మరియు సరైన సమయంలో సరైన సమాచారం ఇవ్వడంలో మేకర్స్ గొప్పగా పని చేసారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ టీజర్ తర్వాత, గుంటూరు కారం నుండి మొదటి గీతం విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు మహేష్ బాబుకి, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ కి అద్భుతమైన ఆడియోలను అందించిన ఎస్.ఎస్. థమన్ ఈ భారీ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు, 'దమ్ మసాలా' వంటి స్పైసీ ట్రాక్‌తో దీపావళిని జరుపుకోవాలని మేకర్స్ నిర్ణయించారు.
 
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 7వ తేదీ సాయంత్రం 04:05 గంటలకు 'దమ్ మసాలా' పాట విడుదల చేయబడింది. సరస్వతీ పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలుపుతోంది. థమన్ అందించిన ట్యూన్, బీట్ సరికొత్తగా ఉన్నాయి. "నా తలరాతే రంగుల రంగోలి. దిగులైనా చేస్తా దీవాలి. నా నవ్వుల కోటని నేనే ఎందుకు పడగొట్టాలి", "నేనో నిశబ్దం, అనునిత్యం నాతో నాకే యుద్ధం" వంటి పంక్తులతో గీత రచయిత పాత్రలోని లోతును ఆవిష్కరించారు. ఈ పాట రాబోయే పండుగలకు అభిమానుల వేడుకలకు గొప్ప వంటకం అవుతుంది.
 
Mahesh Babu
యువ సంచలన నటి శ్రీలీల ఈ చిత్రంలో మహేష్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కించుకుంది. అలాగే, గుంటూరు కారం తారాగణంలో మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ వంటి ప్రముఖ నటీనటులు ఉన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్న ఈ చిత్రానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో సూపర్ మాస్ చిత్రంగా రూపొందుతోన్న 'గుంటూరు కారం' 2024, సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.