శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:36 IST)

రెండు భాగాలుగా మహేశ్ బాబు - రాజమౌళి యాక్షన్ అడ్వెంచర్ మూవీ?

rajamouli - mahesh
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో యాక్షన్ అడ్వెంచర్ తరహాలో జానర్‌లో తెరకెక్కే చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు. జనవరి నుంచి సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గెటప్, లుక్‌ కోసం మహేశ్ మేకోవర్‌లో ఉండగా, ద్రశకుడు మాత్రం స్క్రిప్టుపై కసరత్తులు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో జనవరిలో ప్రారంభంకానున్న ఈ చిత్రం గురించి మరో వార్త వినిపిస్తోంది. మహేశ్ - రాజమౌళి సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో కొనసాగే ఈ కథను ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే విధంగా లేదని రాజమౌళి అండ్ ఆయన బృందం ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. 
 
భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న ఈ చిత్రం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర యూనిట్ ముందే నిర్ణయం తీసుకుందట. ఈ చిత్రంలో ఇండియన్ ఆర్టిస్టులతో పాటు విదేశీ నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇండియానా జోన్స్ మాదిరిగా ఈ చిత్రం సీక్వెల్‌కు ఒకదాని తర్వాత మరొకటి వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు. 
 
ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తున్న విషయం తెల్సిందే. నిర్మాత కేఎల్ నారాయణ తన సొంత బ్యానర్ దుర్గా ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా రూపొందించి విడుదల చేయనున్నారు.