బాహుబలిని గుర్తు చేస్తోన్న సవ్యసాచి..!
అక్కినేని నాగచైతన్య - చందు మొండేటి కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సవ్యసాచి. ఈ చిత్రంలో చైతన్య సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్నినిర్మించింది. ఇందులో చైతన్యకు సిస్టర్‌గా భూమిక నటించడం విశేషం. మాధవన్ కీలక పాత్ర పోషించారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆఖరికి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.
అంతే బాగానే ఉంది మరి.. సవ్యసాచి బాహుబలిని గుర్తు చేయడం ఏంటి అనుకుంటున్నారా..? విషయం ఏంటంటే.. సవ్యసాచి టైటిల్ సాంగ్‌ను ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసారు. సంస్కృత పదాలతో చండ మార్తాండ భా మండలీ.. అంటూ చాలా గంభీరమైన సాహిత్యంతో మొదలవుతుందీ పాట. శివశక్తి ఏ పాట రాసినా.. సంస్కృత పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. లోతైన భావాలతో ఆయన పాటలు రాస్తుంటారు.
ఇందులోనూ అలాగే బాగా లోతైన భావాలు ఉన్నాయి. ఆయన చివరిగా బాహుబలిలో భళి భళి భళిరా పాట రాశారు. సవ్యసాచిలో ఆ తరహా పాట రాయడంతో బాహుబలిని గుర్తు చేస్తోంది ఈ పాట. సవ్యసాచి నుంచి రిలీజ్ చేసిన మూడవ పాట ఇది. ఈ మూడు పాటలు విశేషంగా ఆకట్టుకుంటుండటంతో సవ్యసాచిపై అంచనాలు పెరుగుతున్నాయి. మరి... సవ్యసాచి ఆశించిన విజయాన్ని అందిస్తుందని ఆశిద్దాం.