ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అంటూ చిరంజీవి పలుకరించడంతో ఆశ్చర్యపోయా : హీరో నాని
మెగాస్టార్ చిరంజీవి తనను ఓ సందర్భంలో బాగున్నారా ప్రొడ్యూసర్ గారూ అంటూ పిలవడం ఆశ్చర్యపోయాను అంటూ హీరో, నిర్మాత నాని అన్నారు. నాని నిర్మాతగా ప్రియదర్శి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "కోర్టు : స్టేట్ వర్సెస్ ఏ నోబడీ". ఈ నెల 14వ తేదీన విడుదలకానుంది. తాజాగా ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల చిరంజీవితో జరిగిన ఓ సరదా సంభాషణను హీరో నాని వెల్లడించారు.
"హీరో నాగ చైతన్య పెళ్లిలో నేను కారు దిగి మండపంలోకి వెళుతుంటే చిరంజీవి ఎదురువచ్చారు. ప్రొడ్యూసర్ గారూ బాగున్నారా అని పలకరించారు. నన్ను కాదనుకొని వెనుక అశ్వనీదత్ వంటి గొప్పవాళ్లు ఎవరైనా వస్తున్నారేమోనని వెనుదిరిగి చూశాను. అక్కడ ఎవరూ లేరూ. మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారూ అని చిరంజీవి నాకు హగ్ ఇచ్చారు. ఆయన నన్ను అలా పిలవడంతో ఆశ్చర్యపోయాను" అని చెప్పారు.
ఇదే ఇంటర్వ్యూలో దర్శకుడు, నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ, "చిరంజీవి కోర్టు పోస్టర్ చూసి తనను అభినందించారని చెప్పారు. "నువ్వు సూట్ వేసుకున్న పోస్టర్ చూశాను. చాలా బాగున్నావు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కదా.. హిట్ అవుతుందిలే" అన చిరంజీవి అన్నారని ప్రియదర్శి చెప్పారు. ఆయన అంత నమ్మకంతో చెప్పడంతో తనకు సంతోషమేసిందన్నారు.