ఆసుపత్రి బిల్లులపై నిఖిల్ ఆగ్రహం
కరోనా కష్టకాలంలో తనకు చేతనైనంత సాయం చేస్తూ అందరితోపాటు తనూ ఒకడిగా మంచి పనులు చేస్తున్నాడు యువ హీరో నిఖిల్. కరోనా సమయంలో ఎంతో మంది ఇబ్బంది పడుతుంటే చూసి చలించి పోయి వారికి సాధారణ సరుకులు, ఆక్సిజన్ సిలెండర్లు కూడా అందజేశారు. తాము ఇంత కష్టపడుతుంటే ఆసుపత్రికి వెళ్ళి పిట్టలా రాలిపోతున్న రోగులను చూసి చలించిపోయాడు. సాధారణ రోగుల నుంచి కూడా లక్షల్లో ఆసుపత్రి వర్గాలు బిల్లు ముక్కు పిండీ వసూలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అసలు వీరిని కంట్రోల్ చేసేవారు లేరా? ఎవరు చేయాలి? అంటూ ట్వీట్ చేశాడు.
నేను చాలామంది పేషెంట్ల బిల్లులను పరిశీలించాను. అందరివీ లక్షల్లో బిల్లులు వున్నాయి. అందుకే కొంతమందికి ఆసుపత్రి బిల్లులలో కూడా సాయం చేశాం. సాధారణ సర్జరీకి కూడా అధిక మొత్తంలో బిల్లులు వసూలు చేయడం తెలుసుకుని ఆశ్చర్యపోయా అన్నారు. ఈ క్రమంలో ఆసుప్రతిలో బెడ్ కావాలంటే 20, నుంచి 30వేలు అడుగుతున్నారని ఓ నెటిజన్ ఫిర్యాదు చేశాడు. బెడ్‌ను ఏమైనా బంగారంతో తయారు చేశారా? అంటూ నిఖిల్ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఎవరు చర్య తీసుకోవాలి? అంటూ మండి పడ్డారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు హీరోలు కూడా వ్యక్తం చేస్తూ, నిఖిల్‌కు మద్దతుగా నిలిచారు. మరి నిఖిల్ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి?