బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 29 మార్చి 2018 (10:57 IST)

అది చేస్తేనే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి : వెంకయ్య నాయుడు

తెలుగు భాషను మాట్లాడటం, తెలుగు భాషను ప్రోత్సహించడమే స్వర్గీయ ఎన్.టి.రామారావుకు ఇచ్చే నిజమైన నివాళి అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించే ఎన్టీఆర్ బయోప

తెలుగు భాషను మాట్లాడటం, తెలుగు భాషను ప్రోత్సహించడమే స్వర్గీయ ఎన్.టి.రామారావుకు ఇచ్చే నిజమైన నివాళి అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించే ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర ప్రారంభోత్సవం కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకయ్య నాయుడు పాల్గొని 'ఎన్టీఆర్' చిత్రానికి క్లాప్ కొట్టారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సినిమాల ప్రారంభోత్సవాలకు సాధారణంగా రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులూ హాజరు కాబోరని, అయినా తాను బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్‌కు వచ్చానని, ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానమే తనను ఇక్కడికి రప్పించిందని, ఇంతకుమించి మరో ఉద్దేశ్యం లేదన్నారు. 
 
ఎన్టీఆర్ చరిత్రను సృష్టించి, దాన్ని తిరగరాసిన వ్యక్తని, అటువంటి వ్యక్తి జీవితగాథను, ఆయన కుమారుడే తెరకెక్కించేందుకు ముందుకు రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. నిజానికి గురువారం తానెంతో బిజీ షెడ్యూల్‍లో ఉన్నానని, ఇక్కడి నుంచి పుణె వెళ్లి, తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉందని చెప్పారు. ఇలాంటి బిజీ షెడ్యూల్‌లోనూ ఇక్కడకు రావడం తన మనసుకు ఆనందాన్ని కలిగించిందన్నారు. 
 
నటనలో, రాజకీయంలో రాణించిన రామారావు, నటనలో, దరహాసంలో, దర్పంలో, ఠీవిలో తనకెంతో నచ్చుతారని, ఇప్పటికీ, రాముడు, కృష్ణుడు అంటే ఆయనే గుర్తొస్తారని అన్నారు. మనమంతా తెలుగులో మాట్లాడి, తెలుగును ప్రోత్సహించడం ద్వారానే రామారావుకు నిజమైన నివాళిని తెలిపిన వారమవుతామన్నారు. 

పైగా ఇది చరిత్రలో నిలిచిపోయే సందర్భమన్నారు. తెలుగుతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. తెలుగువారికి ఓ గుర్తింపు తెచ్చిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమాగా రావడం శుభదాయకమన్నారు. రామారావు అభిమాని కానివారు సినీరంగంలో లేరంటే అతిశయోక్తి కాదన్నారు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయిన లవకుశ, పాతాళభైరవి, దేశోద్ధారకుడు చిత్రాలు మార్చి 29నే  రిలీజ్‌ అయ్యాయని గుర్తు చేసిన ఆయన.. అదేరోజు ప్రారంభమవుతున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం విజయం సాధించాలి. ఆయన జీవిత చరిత్ర నవతరాలకు తెలియాలి ఆకాంక్షించారు.  
 
ఓ మహానుబావుడి చరిత్రను రాయడం, సినిమాగా తీయడం చాలా అవసరం. ఈ ప్రయత్నాన్ని బాలకృష్ణ చేపట్టడం అభినందనీయం. తన తండ్రి పాత్రను కుమారుడు పోషించడం దేశ చరిత్రలో నూతన అధ్యాయానికి దారితీస్తుంది. 'ఎన్టీఆర్' చిత్ర ప్రారంభం వేడుకలో పాల్గొనడం నా అదృష్టం. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన చరిత్ర సృష్టించారు. 
 
తెలుగుదనానికి, దర్పానికి ఆయన ప్రతిరూపం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అంటే మనకు ఎన్టీఆరే సాక్షాత్కారమవుతారు. అంతగా ఆయన నటతో ప్రజల జీవితాలపై తనదైన ముద్ర వేశారు. ఎన్టీఆర్‌ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగించడం అభినందనీయం. ఎన్టీఆర్‌ జీవితాన్ని నవతరానికి అందించే ప్రయతం చేయడం సంతోషం. ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఈ చిత్రంలో హీరో బాలకృష్ణ స్వయంగా తన తండ్రి ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో బాలయ్య దుర్యోధనుడి వేషధారణలో విచ్చేశారు. "ఎన్టీఆర్" బయోపిక్‌ను ఎన్‌.బి.కె. ఫిల్మ్స్‌, వారాహి చలనచిత్రం, విబ్రీ మీడియా సమర్పిస్తుండగా, ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు సినీ, రాజకీయ రంగాలు సహా వివిధ రంగాల నుంచి పలువురు అతిరథ, మహారథులు హాజరయ్యారు.