శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 4 ఆగస్టు 2016 (15:43 IST)

అరుదైన కలయిక.. పవన్ కళ్యాణ్‌తో క్రిష్ కొత్త ప్రాజెక్టు.. 'గౌతమీపుత్ర' తర్వాత!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన కలయిక చూడబోతున్నాం. ఇప్పటికే తనలోని ప్రతిభను చాటిచెప్పడమే కాకుండా విలక్షణ దర్శకుడిగా పేరుగడించి... మానవీయ అంశాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల మనసు దోచుకున్

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ అరుదైన కలయిక చూడబోతున్నాం. ఇప్పటికే తనలోని ప్రతిభను చాటిచెప్పడమే కాకుండా విలక్షణ దర్శకుడిగా పేరుగడించి... మానవీయ అంశాల ఆధారంగా సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల మనసు దోచుకున్న దర్శకుడిగా జాగర్లమూడి రాధాకృష్ణ అలియాస్ క్రిష్‌ గుర్తింపు పొందాడు. 
 
అలాగే, తాను హీరోగా ఉండి కూడా అలాంటి చిత్రాల్లో నటించలేక పోయినా.. సమాజంలో వెలుగు చూసే మానవీయ సంఘటనలపై స్పందించే హీరోగా పవన్ కళ్యాణ్‌ పేరును ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో దృశ్యమాలిక కనువిందు చేయనుంది. 
 
ప్రస్తుతం గౌతమీపుత్ర శాతకర్ణికి మెరుగులు దిద్దుతున్న క్రిష్ ఆ సినిమా పూర్తవగానే పవన్‌తో కలసి పనిచేయబోతున్నట్టు సమాచారం. అయితే, ఈ జంట పనిచేస్తుంది సినిమా కోసం కాదు. ఉత్తర భారతంలో హిట్ అయిన 'సత్యమేవ జయతే' తరహాలో తెలుగులో ఒక షోను నిర్వహించేందుకు ఒక ఛానల్ ప్లాన్ చేస్తోందట. ప్రజాసేవలో ఎప్పుడూ ముందుండే పవన్ అయితే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా సరిపోతాడని ఆ ఛానల్ పవన్‌ను ఒప్పించేందుకు ప్రయత్నిస్తోందట. 
 
పవన్ లాగే తన సినిమాల్లో సందేశాత్మక అంశాలను చొప్పించే క్రిష్ ఈ షోకు దర్శకత్వం వహిస్తే బాగుంటుందని భావించిన ఛానల్ క్రిష్‌ను సైతం సంప్రదిస్తోంది. ఈ చర్చలు సఫలమై, పవన్, క్రిష్ కలయికలో షో వస్తే మాత్రం బుల్లి తెరపై సంచలనం స‌ృష్టించడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.