శనివారం, 30 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 7 అక్టోబరు 2022 (10:35 IST)

రెండు భాగాలుగా శ్రీసత్యసాయి అవతారం సినిమా

clap by bharani
clap by bharani
శ్రీపుట్టపర్తి సత్యసాయిబాబా గురించి అంద‌రికీ తెలియాల‌నే సంకల్పంతో ‘శ్రీసత్యసాయి అవతారం’ పేరుతో చిత్రం రూపొందుతోంది.  విజయదశమినాడు సారధి స్టూడియోలో ఈ సినిమా షూటింగ్‌ వైభవంగా ప్రారంభం అయింది. దర్శకుడు సాయిప్రకాష్‌ దర్శకత్వంలో రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఆయన దర్శకత్వంలో వస్తున్న 100వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రాన్ని స్వామి భక్తులు ప్రముఖ డాక్టర్‌ దామోదర్‌ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌ నివ్వగా, కె. అచ్చిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ స్విచ్ఛాన్‌ చేశారు. ఎస్‌.వి. కృష్ణారెడ్డి తొలిషాట్‌కు దర్శకత్వం వహించారు. నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సి.హెచ్‌. మధన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయగా, నటులు సాయికుమార్‌, సుమన్‌, బాబూమోహన్‌ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
 
అనంత‌రం దర్శకుడు సాయిప్రకాష్‌ మాట్లాడుతూ, స్వామి ఎప్పుడూ అందరినీ ప్రేమించండి, అందరికీ సేవ చేయండి అని చెపుతూ ఉంటారు. ఇది అక్షరాలా నిజం. మానవ సేవయే మాధవ సేవ అనే గొప్ప విషయం ఇందులో ఇమిడి ఉంది. ఈ విజయదశమి పర్వదినాన ఎలాగైనా సినిమా ప్రారంభోత్సవం జరిపించాలని మా నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ గారు పట్టుబట్టారు. స్వామి కృపతో దిగ్విజయంగా ప్రారంభోత్సవం జరుపుకుంది మా సినిమా. ఇందులో భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు 400 మంది నటించబోతున్నారు. నవంబర్‌ నుంచి రెగ్యులర్‌గా షూటింగ్‌ చేస్తాం.  రెండు భాగాలుగా చేయాలనేది మా నిర్మాతల నిర్ణయం. అవసరం అయితే మరిన్ని భాగాలు చేయడానికి కూడా నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు అన్నారు.
 
పృథ్వి మాట్లాడుతూ... బాబాగారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ చిత్రంలో నేను విష్ణుమూర్తిగా నటించడం నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. సాయిప్రకాష్‌ వంటి గొప్ప దర్శకులు రూపొందిస్తున్న ఈ సినిమా తప్పకుండా సూపర్‌ సక్సెస్‌ సాధిస్తుంది. దర్శక, నిర్మాతలకు నా ధన్యవాదాలు అన్నారు.
 
నటి అర్చన మాట్లాడుతూ... విజయదశమి పర్వదినాన ఆ మహాలక్ష్మి పాత్రలో షూటింగ్‌ చేయడం నిజంగా నా అదృష్టం. శ్రీరామదాసు చిత్రంలో సీత పాత్రకు నాకు ఎంతో పేరు వచ్చింది. ఈ సినిమాలో కూడా ఈ పాత్ర అంతకు మించి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. సత్యసాయి గారికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అసంఖ్యాక భక్తులు అభిమానం, ఆశీర్వాదం ఈ సినిమాకు ఖచ్చితంగా ఉంటాయి అన్నారు.
 
 కోటా శంకర్రావు మాట్లాడుతూ... ఈ సినిమాలో స్వామి వారికి తల్లిని కావాలనే ఆశపడే ఆదిశేషుని పాత్రను చేస్తున్నాను. సత్యసాయి కరుణా కటాక్షాల వల్లనే నేను ఈ పాత్రకు ఎంపికయ్యానని మనసా, వాచా నమ్ముతున్నాను. ఆ స్వామిలీలల మాదిరిగానే ఈ సినిమా కూడా అందరినీ కట్టిపడేస్తుందని చెప్పగలను. స్వామి వారి చరిత్రను నేటి తరం ఈ సినిమా రూపంలో చూసి, భక్తిభావం పెంచుకుంటారని ఆశిస్తున్నాను. సాయిప్రకాష్‌ గారికి, నిర్మాత దామోదర్‌ గారికి ధన్యవాదాలు అన్నారు.
 
బాబూ మోహన్‌ మాట్లాడుతూ... నాకు కూడా స్వామితో మర్చిపోలేని అనుభూతి ఉంది. ఒకసారి ఆయన స్వంత విమానంలో ఆయనతో కలిసి నేను ప్రయాణం చేశాను అది నా పూర్వ జన్మల సుకృతం. అప్పట్లో అంజలీదేవిగారు స్వామివారిపై తీసిన సీరియల్‌లో నేను ఒక పాత్రను వేశాను. సత్యసాయి వారు జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశారు. ఆ తప్పు నా దగ్గర చేస్తారు. ఆ క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టం. ఈ సినిమా అందరికీ మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా అన్నారు.
 
నారదుని పాత్రలో నటిస్తున్న అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఈ సినిమాలో నాకు నారదుని పాత్ర ఇవ్వడం సంతోషంగా ఉంది. నా కెరీర్‌లో గ్యాప్‌ వచ్చిన ప్రతిసారీ నారదుని పాత్ర రావడం, మళ్లీ పీక్‌కు వెళ్లడం.. ఇలా మూడు సార్లు జరిగింది. ఈ సినిమాలో అవకాశం రావడం నిజంగా సత్యసాయి దీవెనలవల్లే అని నమ్ముతున్నాను అన్నారు.
 
నటి శివపార్వతి మాట్లాడుతూ, సత్యసాయి బాబా వారు మావన సేవ చేయడం వల్లనే దేవుడయ్యారు అన్నది సత్యం.  మనిషిగా ఉంటూనే సాటి మనుషులతో దేవుడిగా కొలవబడటానికి ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలో అవన్నీ సత్యసాయి చేశారు. సత్యసాయి వంటి మహానుభావుల జీవిత చరిత్ర ముందు తరాలకు తెలిసేలా ఈ సినిమాను రూపొందించడానికి దర్శక, నిర్మాతలు పూనుకోవడం నిజంగా అభినందనీయం అన్నారు.
 
కో`ప్రొడ్యూసర్‌ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ... నిర్మాత డాక్టర్‌ దామోదర్‌ గారు అర్జంటు పనిమీద దుబాయ్‌లో ఉన్న కారణంగా ఈ అద్భుతమైన ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. ఆ స్వామి వారి ఆశీర్వాదాలు మా అందరిపై ఉన్నందు వల్లనే ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగింది. సాయిప్రకాష్‌ గారు ఓ లెజెండ్‌ పర్సనాలిటీ. ఆయనతో మేం సినిమా చేయడం మా అదృష్టంగా చెప్పవచ్చు. ప్రపంచం మొత్తం మీద కోట్లాది మంది సత్యసాయి గారికి పరమ భక్తులు ఉన్నారు. అయినప్పటికీ ఆయన జీవిత చరిత్రను సినిమాగా చేసే అవకాశం మాకే దక్కడం బాబా గారి అనుగ్రహం అనుకుంటున్నాం అన్నారు.
 
ఈ చిత్రానికి కెమెరా: జె.జి. కృష్ణ, ఎడిటర్‌: ఈశ్వర్‌రెడ్డి కె., ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : సత్యనారాయణ్‌, పి.ఆర్‌.ఓ: సురేష్‌ కొండేటి, ఆర్ట్‌ డైరెక్టర్‌ : నాగు, కో`ప్రొడ్యూసర్‌ : గోపీనాథ్‌రెడ్డి, నిర్మాత: డా॥ బి. దామోదర్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఓం సాయిప్రకాష్‌.