సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 30 నవంబరు 2024 (08:50 IST)

రాత్రికి తీరందాటనున్న తుఫాను... ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్

cyclone
నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న తీవ్ర వాయుగుండం శుక్రవారం నాటికి పెను తుఫానుగా మారింది. ప్రస్తుతం శనివారం ఉదయానికి ఏడు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్యంగా పయనిస్తోంది. వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న భారత వాతావరణ శాఖ తుఫానుగా బలపడిందని ప్రకటించింది. శనివారం మధ్యాహ్నానికి నాగపట్టణానికి తూర్పుగా 200 కి.మీ., చెన్నైకు 300 కి.మీ. ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. 
 
తుఫాన్ స్వల్పంగా దిశ మార్చుకుని పశ్చిమ వాయవ్యంగా పయనించి శనివారం రాత్రికి మహాబలిపురం, కారైక్కాల్ మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ కారణంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్‌ను జారీచేసింది. 
 
మరోవైపు, ఈ తుఫాను ఉత్తర తమిళనాడు వైపు దూసుకువస్తున్న నేపథ్యంలో ఉత్తర తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. 
 
ఇంకా అన్నమయ్య జిల్లాలో భారీ నుంచి అతిభారీ, ప్రకాశం, కడప జిల్లాల్లో భారీవర్గాలు, శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ప్రకాశం, కడప జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 
 
తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. శనివారం దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కి.మీ., ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయి. ఇంకా.. డిసెంబరు ఒకటి, రెండో తేదీల్లో తీరం వెంబడి గాలులు వీస్తాయని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో అలల ఉదృతి పెరిగింది. తుఫాను నేపథ్యంలో ఉత్తర తమిళనాడు సమీపంలో ఉన్న కృష్ణపట్నం ఓడరేవులో ఆరో నంబరు ప్రమాద హెచ్చరిక, ఇతర ప్రధాన ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేశారు.