శుక్రవారం, 6 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 29 నవంబరు 2024 (16:47 IST)

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

fengal cyclone
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ అమరావతి విభాగం వెల్లడించింది. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం చెన్నైకు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. ఇది తుఫానుగా మారిన తర్వాత వాయువ్య దిశగా పయనిస్తూ శనివారం మధ్యాహ్నానికి కారైక్కాల్ - మహాబలిపురం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేస్తు్న్నారు. ఈ తుఫానుకు ఫెంగల్ అని నామకరణం చేసిన విషయంతెల్సిందే.
 
దీని ప్రభావం కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ముఖ్యంగా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాలో గరిష్టంగా గంటకు 60 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల జాలర్లు చేపలవేటకు వెళ్లరాదని, ఇప్పటికే సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన వారు తక్షణం తీరానికి తిరిగి రావాలని కోరింది. 
 
ఇదిలావుంటే, తుఫాను నేపథ్యంలో ఏపీలోని కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలను జారీచేశారు. రాష్ట్రంలో మిగిలిన పోర్టుల్లో ఒకటో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.