ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 17 జనవరి 2024 (12:13 IST)

కృష్ణ చివరి చిత్రం కృష్ణ విజయం విడుదలకు సిద్దమవుతోంది

muppalaneni siva, Madhusudan Havaldar and others
muppalaneni siva, Madhusudan Havaldar and others
సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం". అంబుజా మూవీస్ పతాకంపై మధుసూదన్ హవల్దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ పనులు జరుపుకుంటోంది. నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలి, సూర్య, గీతా సింగ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని, ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా నిర్వహించారు.

చిత్ర యూనిట్ తో పాటు ప్రముఖ దర్శకులు ముప్పలనేని శివ, సంజీవ్ కుమార్ మేగోటి, ప్రముఖ దర్శకనిర్మాత లయన్ సాయి వెంకట్, ప్రముఖ నిర్మాతలు ఎస్.వి.శోభారాణి, జె.వి.మోహన్ గౌడ్, గిడుగు క్రాంతి కృష్ణ, బిజినెస్ కో ఆర్డినేటర్ నారాయణ, ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ పాల్గొని, చిత్రం ట్రైలర్ విడుదల చేశారు.
 
దీనికి ముందు "కృష్ణ విజయం" చిత్రాన్ని కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కు ప్రదర్శించారు. ఈ సందర్భంగా "గుంటూరు కారం" సాధిస్తున్న సంచలన విజయాన్ని పురస్కరించుకుని సక్సెస్ కేక్ కట్ చేశారు. కన్నడలో ప్రముఖ దర్శకుడిగా మన్ననలు అందుకుంటున్న మధుసూదన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం చాలా బాగుందని, ఈ చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ ఫ్యాన్స్ అంతా గర్వపడేలా "కృష్ణ విజయం" చిత్రాన్ని తీర్చి దిద్దిన మధుసూదన్ అభినందనీయులని పేర్కొన్నారు.
 
సూపర్ స్టార్ కృష్ణను దర్శకత్వం వహించే అవకాశం రావడం తనకు దక్కిన అదృష్టంగా చిత్ర దర్శకుడు మధుసూదన్ పేర్కొన్నారు. శ్రీలేఖ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి అన్ని పాటలు భాస్కరభట్ల రాశారని, ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల తేది ప్రకటిస్తామని మధుసూదన్ తెలిపారు.