శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 13 నవంబరు 2018 (16:52 IST)

నవంబర్‌ 24న 'సైరా నరసింహారెడ్డి' మ్యూజిక్‌ డైరెక్టర్‌ అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్

ప్రముఖ బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది నవంబర్‌ 24న తొలిసారి హైదరాబాద్‌లో మ్యూజిక్‌ లైవ్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో జోనితా గాంధీ, దివ్యా కుమార్‌ తదితరులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం సంగీత ప్రియులకు తప్పకుండా వీనుల విందుగా ఉంటుందనడంలో సందేహం లేదు. 'ఇంద్ర ధనుష్‌ - అమిత్‌ త్రివేది లైవ్‌ కాన్సర్ట్‌' అనే పేరుతో ఈ సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
 
మనిషి తన జీవితంలో సంతోషం, బాధ, ప్రేమ ఇలాంటి ఎన్నో అనుభవాలను చవిచూస్తాడు. అలాంటి అనుభవాల కలయికనే ఇంద్రధనుస్సు అని మనం సంబోధిస్తుంటాం. కాబట్టి ఈ ప్రోగ్రామ్‌కు ఇంద్రధనుష్‌ అనే పేరుని పెట్టారు. ఈ కార్యక్రమంలో అమిత్‌ సౌండ్‌లో కొత్త టెక్నాలజీని అందరికీ పరిచయం చేయబోతున్నారు. థియేటర్స్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన అమిత్‌ త్రివేది పలు జింగిల్స్‌, యాడ్‌ ఫిలిమ్స్‌కు పనిచేశారు. 
 
'ఆమిర్‌' చిత్రంతో 2008లో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. 'దేవ్‌ డి' చిత్రం కోసం అనురాగ్‌ కశ్యప్‌తో జత కట్టారు. ఈ చిత్రానికిగాను అమిత్‌ త్రివేదికి నేషనల్‌ అవార్డు కూడా దక్కింది. ఉడాన్‌, వేకప్‌ సిద్‌, మన్‌ మర్జియాన్‌ వంటి చిత్రాలకు ఈయన తన సంగీతాన్ని అందించారు. 
ఇండియన్‌ సినిమాల్లో కొత్త సంగీతాన్ని పరిచయం చేసిన సంగీత దర్శకుల్లో అమిత్‌ త్రివేది తనదైన మార్కును చూపించారు. కేవలం పాశ్చాత్య సంగీత పోకడలతో అందరినీ ఆకట్టుకోవడమే కాదు.. శాస్త్రీయ సంగీతంపై మంచి అవగాహన ఉంది. తెలుగులో ఎంతో ప్రెస్టీజియస్‌ చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న 'సైరా నరసింహారెడ్డి'తో ఇక్కడి తెలుగు ప్రేక్షకులను మైమరపింప చేయడానికి హైదరాబాద్‌ వస్తున్న అమిత్‌ త్రివేదికి హైదరాబాద్‌ ఘన స్వాగతం పలుకుతుంది.