శ్రావణి ఆత్మహత్య కేసు మలుపు.. మర్యాదగా గంట గడుపు.. లేదంటే..?
బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు మలుపు తిరుగుతోంది. శ్రావణి, దేవరాజు రెడ్డి సంభాషణతో కూడిన ఆడియో వెలుగులోకి వచ్చింది. ఆ ఆడియోలో మర్యాదగా తనతో వచ్చి గంట పాటు గడపాలని దేవరాజ్ బెదిరింపులకు పాల్పడినట్టు వుంది. ఆపై జరిగే పరిణామాలకు తనను అడగవద్దని హెచ్చరించాడు. దీంతో శ్రావణి స్పందిస్తూ.. 'ఇంతటితో ఆపేయ్.. నీతో మాట్లాడను దేవా' అంటూ ప్రాధేయ పడినట్టు ఆ సంభాషణలో ఉంది.
మరోవైపు, ఈ కేసులో తనపై దేవరాజు రెడ్డి చేసిన ఆరోపణలపై సాయి కృష్ణారెడ్డి అనే వ్యక్తి స్పందించాడు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ వీడియో విడుదల చేశాడు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడిని మాత్రమేనని తెలిపాడు.
శ్రావణి జీవితాన్ని కాపాడేందుకు ప్రయత్నించానని, ఆమె ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి ఆ కుటుంబంతో పాటే ఉన్నానన్నాడు. తానెక్కడికీ పారిపోలేదని తెలిపాడు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందనీ.. ఆమె ఆత్మహత్యకు కారణం తాను కాదని తెలిపాడు. శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.