ఒకే ఫ్యామిలీలో 32 మందికి కరోనా... వైరస్ దెబ్బకు మాజీ మంత్రి మృతి
కరోనా వైరస్ మహమ్మారి అనేక మంది ప్రాణాలను హరిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఓ మాజీ మంత్రి చనిపోయారు. ఆయన పేరు మాతంగి నర్సయ్య మృతి చెందారు. హైదరాబాదులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
కరోనాకు తోడు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తోడవడంతో ఆయన ఆరోగ్యం విషమించింది. మరో విషాదకర విషయం ఏమిటంటే... ఆయన భార్య బోజమ్మ కూడా 15 రోజుల క్రితం కరోనా కారణంగా చనిపోయారు. రెండు వారాల వ్యవధిలోనే దంపతులిద్దరూ కన్నుమూయడంతో... వారి ఇంట విషాదం నెలకొంది. నర్సయ్య మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మాతంగి నర్సయ్య మంత్రిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత నెల 8న మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య కూడా కరోనాతో మృతి చెందిన సంగతి తెలిసిందే.
మరోవైపు, ఉత్తర ప్రదేశ్‌లోని బందా జిల్లా ఫుటా కువాన్ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 32 మంది కరోనా బారినపడినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) ఎన్‌డీ శర్మ తెలిపారు. సోమవారం సాయంత్రం ఒకే ప్రాంతంలో నివసిస్తున్న కుటుంబానికి చెందిన 30 మందికి కోవిడ్ -19 పరీక్ష చేయగా అందరికీ పాజిటివ్ వచ్చినట్లు ఆయన తెలిపారు.
ఫుటా కువాన్‌కు చెందిన 44 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా వీరిలో 32 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు. కుటుంబ సభ్యులు వేర్వేరు ఇళ్లలో ప్రత్యేకంగా నివాసం ఉంటుండడంతో వారిని ప్రస్తుతానికి హోం క్వారంటైన్‌లో ఉంచామని చెప్పారు.