శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (08:27 IST)

డ్యాన్స్ చేస్తేనే కేసు నమోదు చేస్తా.. బాలికకు ఇన్‌స్పెక్టర్ వేధింపులు

ఓ అద్దె ఇంటిలో తన తల్లిదండ్రులతో కలిసి నివసించే ఓ బాలిక.. ఇంటి యజమాని మేనల్లుడి చేస్తున్న టార్చర్‌ను భరించలేక అతనిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అయితే, ఆ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదును స్వీకరించాల్సిందిపోయి.. బాలికను వేధించాడు. తన ముందు డ్యాన్స్ చేస్తేనే ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు చేస్తానని బెదిరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, లక్నోలోని గోవింద్ నగర్‌కు సదరు బాలిక తన కుటుంబంతో కలసి ఓ అద్దె ఇంట్లో నివసిస్తుంటుంది. అయితే ఇంటి యజమాని మేనల్లుడు ఇటీవల తనతో పలుమార్లు అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదు చేసేందుకు తన తల్లితో కలసి గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ వెళ్లానని ఆమె చెప్పుకొచ్చింది. 
 
ఆసమయంలో స్టేషన్‌లో ఉన్న ఇన్‌స్పెక్టర్.. డ్యాన్స్ చేస్తేనే కేసు నమోదు చేస్తానంటూ తనకో కండీషన్ పెట్టాడని ఆమె వాపోయింది. మరోవైపు.. అద్దె ఇంటి విషయంలో బాలిక కుంటుబానికి ఇంటి యజమానికి మధ్య వివాదం నడుస్తోందని గోవింద్ నగర్ సర్కిల్ ఇన్‌స్ఫెక్టర్ తెలిపారు. ఈ విషయంలో కలుగ జేసుకోవాలని పోలీసులపై ఒత్తిడి చేసేందుకే ఆ బాలిక.. ఆరోపణల వీడియోను వైరల్ చేసినట్టు తాము ప్రాథమిక అంచనాకు వచ్చామన్నారు.