గురువారం, 5 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2024 (08:25 IST)

ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు తాడేపల్లి ప్యాలెస్‌లో ప్లాన్.. కర్తకర్మక్రియ ఆయనే...

kadambari jaitwani
ముంబై నటి కాదంబరి జెత్వానీ అరెస్టుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారిక నివాసమైన తాడేపల్లి ప్యాలెస్‌లోని ప్లాన్ వేశారు. వైకాపా పెద్దల నుంచి మౌఖిక ఆదేశాలతో ఈ కేసులో కర్తకర్మక్రియ ఇలా అన్నీ సీఐడీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు. సీఐడీ విభాగం డీజీ హోదాలో ఆంజనేయులు ఆదేశించగానే విజయవాడ కమిషనర్ కాంతిరాణా టాటా, డిప్యూటీ పోలీస్ కమిషనర్ విశాల్ గున్నిలు అడ్డంగా తలాడించి ఈ అరెస్టు కథను సంపూర్ణంగా పూర్తి చేశారు. ఈ కారణంగా ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. 
 
గత ప్రభుత్వంలో 'ముఖ్యనేతకు సన్నిహితుడైన పారిశ్రామికవేత్తను కాపాడేందుకు ఒక మహిళను, ఆమె కుటుంబాన్ని అక్రమ కేసులో ఇరికించి, అడ్డగోలుగా వ్యవహరించిన పాపానికి ఫలితమిది. ఒకే కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఒకేసారి సస్పెండ్ కావడం రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. నటి అరెస్టుకు ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషనులో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు.
 
ఈ కేసులో సాక్షులు, సహచరులను ప్రభావితం చేయగల సామర్థ్యమున్న వీరు.. ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని, అందులో భాగంగా ముంబయికి కూడా వెళ్లారని పేర్కొన్నారు. డీజీపీ నివేదికను పరిగణనలోకి తీసుకొని, ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఆదివారం వేర్వేరు ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.