1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 జులై 2025 (22:24 IST)

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

murder
మొదటి భార్యకు పుట్టిన కుమారుడుకి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించిన ఓ కిరాతక తండ్రి.. కొడుకుని చంపేసి నీటి కాలువ పాతిపెట్టాడు. ఈ దారుణం పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఎర్రబాలెంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అచ్చంపేట మండలం, పుట్లగూడెం గ్రామానికి చెందిన భూక్యా వెంకటేశ్వర్లు నాయక్. తన కుటుంబంతో కలిసి మూడు నెలల క్రితం ఎర్రబాలెం వలస వచ్చాడు. అక్కడ గొర్రెలు, మేకలు మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలాల్లోనే తాత్కాలికంగా గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. 
 
ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య కోటేశ్వరమ్మతో 20 యేళ్ల క్రితం వివాహం కాగా, వారికి మంగ్యా నాయక్ (19) అనే కుమారుడు ఉన్నాడు. కొంతకాలం క్రితం కోటేశ్వరమ్మతో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రమీల అనే మహిళను పెళ్ళి చేసుకున్నాడు. 
 
మొదటి భార్య కుమారుడు మంగ్యా నాయక్ తండ్రివద్దే ఉంటున్నాడు. అయితే, తన ఆస్తిలో కుమారుడుకి వాటా ఇవ్వాల్సి వస్తుందని భావించిన భూక్యానాయక్.. పది రోజుల క్రితం కుమారుడుని చంపేసి మృతదేహాన్ని కాలువలో పూడ్చిపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మంగ్యానాయక్ బంధువులు క్రోసూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భూక్యా వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని విచారించగా నిజాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.