ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (11:43 IST)

రామ్ చరణ్‌పై బడా నిర్మాతల అసహనం.. చిరంజీవి ఫిర్యాదు.. ఎందుకు?

ఒకవైపు హీరోగా రాణిస్తూనే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాల్లో నిర్మిస్తున్న నిర్మాత రామ్ చరణ్. ఈయనపై టాలీవుడ్‌కు చెందిన బడా నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే ఆగ్రహం చెందుతూ చెర్రీపై తండ్రి చిరంజీవికి ఫిర్యాదులు చేస్తున్నట్టు సమాచారం. ఇలా ఫిర్యాదు చేయడానికి బలమైన కారణం లేకపోలేదు. 
 
చిరంజీవి టాలీవుడ్ రీ ఎంట్రీ బాధ్యతలను స్వీకరించిన రామ్ చరణ్.. మొదటిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇందుకోసం కొణిదెల ప్రొడక్షన్స్ పతాకం నిర్మాణ హౌస్‌ను ప్రారంభించారు ఈ సంస్థలో "ఖైదీ నంబర్ 150"ను నిర్మించి.. చిరుకు గ్రేట్ గ్రాండ్‌ ఎంట్రీని ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన 'సైరా నరసింహా రెడ్డి'ని నిర్మించి, మెగాస్టార్‌కు గుర్తుండిపోయే పెద్ద బహుమతిని కూడా ఇచ్చారు. 
 
ఇక కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిరు 152ను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చెర్రీనే నిర్మిస్తున్నారు. ఇలా వరుసగా తన తండ్రి ప్రాజెక్ట్‌లను రామ్ చరణ్ చేస్తుండటంతో పలువురు బడా నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెర్రీ తీరు ఏంబాగోలేదని వారు అంటున్నారు. 
 
సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల కోసం మెగాస్టార్‌ అనూహ్యంగా గుడ్‌బై చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం.. ఎన్నికల్లో పోటీ చేయడం.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం.. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ రావడం ఇలా అన్నీ ఒకదాని వెనుక మరొకటి జరిగిపోయాయి. 
 
ఆ తర్వాత చిరంజీవి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు, నిర్మాతల, సినీ ప్రముఖుల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో 'ఖైదీ నంబర్.150'తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. ఇక చిరు సినిమాల్లో మళ్లీ బిజీ అవ్వనున్నాడని తెలుస్తూనే టాలీవుడ్ నిర్మాతలు కూడా సంతోషపడ్డారు. తమ ఫేవరెట్ స్టార్‌తో మళ్లీ సినిమాలు చేయొచ్చని వారు భావించారు. ట
 
ముఖ్యంగా మెగాస్టార్‌తో మంచి అనుబంధం ఉన్న అప్పటి నిర్మాతలైన అల్లు అరవింద్, అశ్వనీదత్, కేఎస్ రామారావు వంటి వారు చిరుతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపించారు. వీరితో పాటు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ దానయ్య వంటి ఇప్పటి నిర్మాతలు కూడా బాస్‌తో సినిమా తీయాలని కలలు కంటున్నారు. 
 
కానీ, చెర్రీ మాత్రం ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండాతానే అన్ని చిత్రాలను నిర్మిస్తుండటంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా అని వారు అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. మరి కొరటాల మూవీ అయిపోయిన తర్వాతైనా.. చెర్రీ మిగిలిన వారికి అవకాశం ఇస్తాడేమో వేచి చూడాల్సివుంది.