సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 ఆగస్టు 2021 (09:14 IST)

నేటి నుండి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ : తొలుత పూరీనే...

తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసు విచారణ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. ఇందులోభాగంగా తొలుత స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ వద్ద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణ జరుపనుంది. 
 
మంగళవారం నుంచి ప్రారంభమయ్యే ఈ కేసు విచారణ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో సెప్టెంబరు 22 వరకు 12 మందిని ప్రశ్నించనుంది. ప్రధానంగా డ్రగ్స్‌ లావాదేవీల్లో జరిగిన మనీ లాండరింగ్‌పైనే ప్రశ్నలు సంధించనుంది. 
 
ఈ విచారణలో భాగంగా, మంగళవారం ఈడీ ముందు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ హాజరుకానున్నారు. నటుడు నవదీప్‌కు చెందిన ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ నుంచి పూరీకి డ్రగ్స్‌ అందినట్లు ఎక్సైజ్‌ అధికారుల విచారణలో బయటకు వచ్చింది. 
 
అంతేకాకుండా, ఈ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు హీరోలు రానా, రవితేజ తదితరులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కాగా, సెప్టెంబరు 2న చార్మీ, 6న రకుల్‌, 8న రానా, 9న రవితేజ, ఆయన డ్రైవర్‌ శ్రీనివాస్‌, 13న నవదీప్‌, ఎఫ్‌-క్లబ్‌ పబ్‌ జనరల్‌ మేనేజర్‌, 15న ముమైత్‌ఖాన్‌, 17న తనీష్‌, 20న నందు, 22న తరుణ్‌ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 
ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాలకు పెద్దమొత్తంలో నిధులు మళ్లించినట్టు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కొనుగోలుకు నగదును ఎలా పంపారు? అసలు నగదు లావాదేవీలు ఎలా జరిగాయి? అనే కోణంలో విచారణ జరుగనుంది. ఇప్పటికే డ్రగ్స్‌ కొనుగోలుపై ఎక్సైజ్‌ అధికారుల నుంచి ఈడీ సమాచారం సేకరించింది.
 
కాగా, ఈ కేసులో మొత్తం 62 మందిని ఎక్సైజ్‌ అధికారులు గతంలో విచారించారు. సినీ ప్రముఖుల విచారణ పూర్తయిన తర్వాత.. మిగిలిన వారందరికి నోటీసులు పంపి ప్రశ్నించాలని ఈడీ భావిస్తున్నట్లు తెలిసింది.