శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (19:06 IST)

సుశాంత్.. ఆర్నెల్లుగా తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు...

ధోనీ బయోపిక్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ముంబై పోలీసులు ఆదివారం స్పందించారు. సుశాంత్ గదిలో సూసైడ్ లెటర్ లభించలేదన్నారు. అయితే, సుశాంత్ గత ఆర్నెల్లుగా డిప్రెషన్‌లో ఉన్నట్టు అర్థమవుతోందని, అతని గదిలో డిప్రెషన్‌కు వాడే మందులు లభించాయని చెప్పారు. 
 
ఈ మధ్యాహ్నం తన గదిలో విగతజీవుడిలా ఫ్యాన్‌కు వేలాడుతున్న స్థితిలో సుశాంత్ రాజ్ పుత్ కనిపించాడు. సుశాంత్ ఇంట్లో సేవకుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించడంతో ఈ విషయం వెల్లడైంది. మరోవైపు, సుశాంత్ ఆత్మహత్యపై టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. 
 
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య దిగ్భ్రాంతికరం. ఎంతో టాలెంట్ ఉన్న నటుడు చిన్నవయసులోనే మరణించడం బాధాకరం అని హీరో జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయపడ్డారు. దిగ్భ్రాంతి కలిగించే విషయం. నోట మాటలు రాని పరిస్థితి ఇది అని దర్శకుడు అనిల్ రావిపూడి వ్యాఖ్యానించారు. 
 
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇక లేడని తెలిసి షాక్ కు గురయ్యాను. అద్భుతమైన ప్రతిభ కలిగి, ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని భావించిన నటుడు ఎంతో త్వరగా వెళ్లిపోయాడు. ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టు హీరో రామ్ చరణ్ పేర్కొన్నాడు. 
 
బాలీవుడ్ ఇంత దిగ్భ్రాంతి కలిగించే సంఘటన ఎప్పుడూ చూడలేదు. ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడంలేదని ఆర్జీవీ వ్యాఖ్యానించగా, ఈ వార్త విన్నప్పటినుంచి షాక్‌తో చేతులు వణుకుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తను నమ్మలేకపోతున్నా అని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యానించింది