యూఏఈ నుంచి ఉపాసనకు గోల్డెన్ వీసా: ప్రపంచ పౌరురాలిని అయ్యానని ప్రకటన
యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకున్నారు.. ఉపాసన. మనసా వాచా భారతీయురాలినని, అయితే అన్ని దేశాల పట్ల అపారమైన గౌరవం ఉందని ఉపాసనమ స్పష్టం చేశారు. ఇప్పుడు గోల్డెన్ వీసా రాకతో అధికారికంగా ప్రపంచ పౌరురాలిని అయ్యానని వివరించారు. ఇండియా ఎక్స్ పో-2020 ద్వారా ఈ ప్రపంచమంతా ఒక్కటే అని తెలుసుకున్నానని, 'వసుధైక కుటుంబం' అనే భావనకు అర్థం తెలిసిందని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే అనేకమంది భారత ప్రముఖులు యూఏఈ గోల్డెన్ వీసాలు అందుకున్నారు. టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, నటి త్రిష, గాయని చిత్రలకు ఈ వీసా దక్కింది. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కుటుంబం కూడా ఈ గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉంది.
ఇకపోతే.. సాధారణంగా యూఏఈలో ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం వెళ్లే విదేశీయులకు అక్కడ ఎవరైనా స్పాన్సర్ చేయాల్సి ఉంటుంది. గోల్డెన్ వీసా ఉన్నట్టయితే నేషనల్ స్పాన్సర్ లేకుండానే యూఏఈలో తమ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు.
ఈ వీసా ఉంటే 100 శాతం యూఏఈ పౌరుడిగానే భావిస్తారు. గోల్డెన్ వీసాలు లాంగ్ టర్మ్ వీసాలు. ఐదేళ్లు, పదేళ్ల ప్రాతిపదికన జారీ చేసే ఈ వీసాలు ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతాయి. 2019 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు.