మైనే ప్యార్ కియా... అమ్మాయిల్ని ఏడిపించడం ప్రపోజ్ చేయడం... రివ్యూ రిపోర్ట్
మైనే ప్యార్ కియా నటీనటులు: ప్రదీప్, ఇషా తల్వార్, సత్యదేవ్, మధుమిత తదితరులు; నిర్మాత: వెంకట్రావ్ సన, సంగీతం: సంతోష్ నారాయణన్, దర్శకత్వం: ప్రదీప్.
చిన్న బడ్జెట్ చిత్రాల పేరుతో ఈమధ్య వస్తున్న కొన్ని చిత్రాల తరహాలోనే 'మైనే ప్యార్ కియా' చిత్రాన్ని నిర్మించారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ప్రేమకథలు బోల్డన్ని వచ్చాయి. వీకెండ్ డేస్, నైట్‌పార్టీలు ఉన్నప్పటికీ అసలైన ప్రేమ కూడా ఉంటుంది. అది మనసు లోతుల్లోంచి పుట్టుకొస్తుంది. దానికోసం కొంచెం ఇబ్బంది పడ్డా ఫైనల్‌గా చేరుకునేది సరైన ప్రేమ దగ్గరకే అనేది చెప్పదలిచాడు. అయితే ఇందులో నటించిన వారంతా కొత్తవారే కావడంతోపాటు చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ల భుజాన వేసుకోవడం ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది.
కథగా చెప్పాలంటే...
నవీన్ (ప్రదీప్) సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్. ప్రేమ పేరుతో తన సబార్డినేట్ కూడా ప్రపోజల్ చేస్తాడు. ఒకరోజు నవీన్ చిన్ననాటి స్నేహితురాలు షాలినీ(ఇషా తల్వార్) ఆ కంపెనీలో జాయిన్ అవుతుంది. నవీన్‌కు అప్పటికే ఆమెతో చిన్నతనంలో చేసిన అల్లరి పనులు అన్నీ గుర్తుకువస్తాయి. ఎక్కడ గుర్తుపడుతుందోనని ఆమె కనబడినప్పుడల్లా ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు. ఒకరోజు ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. అప్పుడే వారితోపాటు చిన్నతనంలో చదివిన షాలిని స్నేహితురాలు గుర్తుపట్టి వీడు వాడే అని చెబుతుంది. దాంతో నవీన్‌ను షాలినీ అసహ్యించుకుంటుంది. ఆ తర్వాత పెద్దలు కుదిర్చిన పెండ్లికి సిద్ధమైన షాలినీని మార్చడానికి నవీన్ తన స్నేహితుడితో కలిసి ఓ ప్లాన్ చేస్తాడు. అది ఏమిటి? మరి చిన్ననాటి సంగతుల్లో అంత భయపడాల్సిన అంశాలేమిటి? అనేది సినిమా.
చెప్పుకోవాల్సినవి :
ఈ చిత్రంలో చెప్పాల్సిన పాత్రల్లో సత్యదేవ్ ఒకటి. చిన్న వయస్సులోనే బాబాయ్‌గా నటించిన ఆయన మంచి హావభావాలను పలికించాడు. మధుమిత పెండ్లి చేసుకున్న తర్వాత చేసిన చక్కటి సినిమా ఇది. ఆమె పాత్ర చాలా నీట్‌గా ఉంటుంది. కుర్ర వయస్సులో ఆమెను ప్రేమించి.. తను కూడా ప్రేమిస్తుందనుకుని.. ఆ తర్వాత ఆమె మరొకరిని పెండ్లి చేసుకునే సీన్స్ పండాయి.
ప్రదీప్, వేణు ఫ్రెండ్స్ చిన్నతనంలో చేసిన అల్లరి, చిలిపి పనులు ఇప్పటి యూత్‌ను ఐడెంటిఫై చేసుకునేవిగా ఉంటాయి. చిత్రంలో కాస్త రిలీఫ్ ఇచ్చేవి ఆ ఎపిసోడ్సే. ప్రదీప్ తెలుగువారికి కొత్త. కొన్ని సన్నివేశాల్లో ఓవర్‌గా చేసినట్లు అనిపిస్తుంది. ఇషా తల్వార్ కథానాయికగా మొదటి సినిమా. 'గుండెజారి..లో సెకండ్ హీరోయిన్ చేసింది. అప్పటికంటే ఈ సినిమాలో డబ్బింగ్ విషయంలో జాగ్రత్తపడ్డాడు దర్శకుడు. పోసాని కృష్ణమురళి 'గే'గా నటించినా సూట్ కాలేదు. హీరో ప్రదీప్ 'గే'గానూ పండించాడు.
విశ్లేషణ..
ఇషా తల్వార్ పబ్లిసిటీ చూపించినంత గ్లామర్ ఇందులో లేదు. కామెడీ పేరుతో చేసిన సన్నివేశాలు చాలా చీప్‌గా ఉన్నాయి. సంభాషణపరంగా కొన్ని బాగున్నా... ఎట్రాక్ట్ కలిగించేవిగా లేవు. టీవీ సీరియల్స్‌పై సెటైర్ వేశారు. తెలిసీ తెలియని వయస్సులో వీసీడీ, కేసెట్ల పేరుతో బ్లూఫిలింలు చూసే విధానం అంతగా చూపాల్సిన అవసరంలేదు. కథకు టర్నింగ్ పాయింట్‌ను దర్శకుడు దాన్ని బేస్ చేసుకుని రాసుకున్నట్లుంది. అది కాకుండా మరోరకంగా రాసుకుని ఉంటే ఫ్యామిలీతో కలిసి చూడతగ్గ సినిమా అయ్యేది. హైసొసైటీ, మారుతున్న కల్చర్‌కు అనుగుణంగా చూసే ఫ్యామిలీస్‌కు ఇటువంటివి పెద్దగా పట్టవు. కామన్‌మేన్‌కు కొంచెం ఇబ్బంది కల్గిస్తుంది. అయితే సినిమాలో ఎక్కడా ట్విస్ట్‌లు, మలుపులు ఏమీ ఉండవు.
కథ ముందుగానే తెలిసిపోవడం ఇందులోని ప్రత్యేకత. ఇంటర్వెల్ బాంగ్‌లో.. హీరోయిన్ హీరోను ఎందుకు అసహ్యించుకుంటుంది అనేది లీక్ చేసేశాడు. సెకండాఫ్‌లో అది ఎలా జరిగింది? అనేది చూపించడం కోసం స్టోరీ కాస్త సాగదీసినట్లుంది. మొదటి భాగమంతా హీరో అమ్మాయిల్ని ఏడిపించడం, ప్రపోజల్ చేయడంతోనే సరిపోతుంది. టైటిల్ పరంగా చెప్పాలంటే... చిన్నతనం నుంచి అసహ్యించుకున్న ఫ్రెండ్‌ను నేనూ ప్రేమించాననేది అసలు పాయింట్.
టెక్నికల్‌గా చెప్పుకోవల్సింది ఏమీ లేకపోయినా సంగీతపరంగా.. ఒకటిరెండు పాటలు వినడానికి బాగున్నాయి. సెకండాఫ్‌లో ఇంకా ఎడిటింగ్‌కు పని కల్పిస్తే బాగుండేది. 'నింగిలోన..' అనే పాట చక్కటి మెలోడీతో కూడింది. 'మనకొద్దు మనకొద్దు ఈ ప్రేమలు మనకొద్దు' అంటూ హీరో తాగి పాడే పాట చిత్రానికి కరెక్ట్‌గా సరిపోతుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల కోసమే తీసినట్లున్న ఈ చిత్రం మల్టీప్లెక్స్‌లో ఆడవచ్చు.