శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 11 ఫిబ్రవరి 2022 (15:30 IST)

క‌న్‌ఫ్యూజ్ కిచిడిగా ర‌వితేజ ఖిలాడి - రివ్యూ రిపోర్ట్‌

Khiladi poster
నటీనటులు: రవితేజ-డింపుల్ హయతి-మీనాక్షి చౌదరి-అర్జున్-ముఖేష్ రుషి-అనూప్-మురళీ శర్మ-నిఖితిన్ ధీర్-రావు రమేష్-వెన్నెల కిషోర్-అనసూయ తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవన్-జీకే విష్ణు
మాటలు: శ్రీకాంత్ విస్సా
నిర్మాత: కోనేరు సత్యనారాయణ
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రమేష్ వర్మ
 
ర‌వితేజ సినిమాలంటే ఫుల్ కిక్‌తో ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుండేవి. కొద్దికాలం ప్లాప్‌ల‌తో వున్న ఆయ‌న‌కు `క్రాక్‌`రూపంలో మ‌లినేని గోపీచంద్ మంచి కిక్ వ‌చ్చేలాచేశారు. ఆ త‌ర్వాత విడుద‌ల‌యిన  ‘ఖిలాడి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కరోనా కారణంగా అనుకున్న దాని కంటే ఆలస్యమైన ఈ చిత్రం ప్రోమోలతో బాగానే ఆసక్తి రేకెత్తించింది. ద‌ర్శ‌కుడు రమేష్ వర్మ `వీర‌` వంటి మ‌ర్చిపోలేని సినిమాను ర‌వితేజ‌కు ఇచ్చాడు. మ‌ర‌లా వీరి కాంబినేష‌న్ తో వ‌చ్చిన ఈ సినిమాకు కె.ఎల్‌. యూనివ‌ర్శిటీ అధినేత స‌త్య‌నారాయ‌ణ 45కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో  సినిమా తీశాడు. మ‌రి ఈరోజే విడుద‌లైన ఈసినిమా ఎలా వుందో చూద్దాం.
 
కథ: 
గాంధీ (రవితేజ) అనాథ‌. పెద్ద బిజినెస్ మేన్ రాజశేఖర్ (రావు రమేష్) అత‌ని పెంచి మేనేజ‌ర్‌ను చేస్తాడు. గాంధీ ముక్కోపి. మ‌రోవైపు రాష్ట్ర హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) సీఎం. అవ్వాల‌నుంటాడు. అందుకు పది వేల కోట్ల రూపాయల‌ను ఎం.ఎల్.ఎ.ల‌కు అంద‌జేయాని వాటిని రాజ‌శేఖ‌ర్‌కు అప్ప‌గించి కాపాడ‌మంటాడు. కానీ విష‌యం తెలిసి పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేర‌ప‌రిశోధ‌న విభాగం ఆఫీస‌ర్ అర్జున్ వివ‌రాలు రాబ‌ట్టాల‌ని చూస్తాడు. ఆ ద‌శ‌లో గాంధీ ద్వారా రాబ‌ట్టాల‌ని రాజ‌శేఖ‌ర్ వ‌ద్ద‌కు పంపుతాడు. ఇంకోవైపు ఓ మాఫియా గేంగ్ గాంధీ ఇంటిలో బంధువుల్లా తిట్ట‌వేసి వారిని బెదిరించి డ‌బ్బు ఎక్క‌డ దాచాడో క‌నుక్కోవాల‌నుకుంటాడు. ఫైన‌ల్‌గా జైలులో త‌న‌ను క‌లిసిన గాంధీకి రాజ‌శేఖ‌ర్ హింట్ ఇస్తాడు. ఆ డ‌బ్బున్న చోట‌ను పోలీసు అధికారి అర్జున్ చెప్పేస్తాడు గాంధీ. ఆ త‌ర్వాత అత‌ను వ‌చ్చి చూస్తే డ‌బ్బులు క‌నిపించ‌వు. ఇక ఈ క‌థ‌లో డింపుల్ హయతి-మీనాక్షి చౌదరి, అన‌సూయ పాత్ర‌లు ఏమిటి?  ఫైన‌ల్‌గా 10వేల కోట్ల రూపాయ‌లు దొరికాయా? దానికోసం మాఫియా గేంగ్ కూడా ఎందుకు వెతుకుతుంది. అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేషణ: 
మాస్ రాజా రవితేజ పేరుకు త‌గిన‌ట్లే జోష్‌గా వుంటాడు. కానీ వ‌య‌స్సు రీత్యా జోష్‌తోపాటు ముఖ‌క‌వ‌ళిక‌లు తెలిసిపోతున్నాయి. ఇన్నాళ్ళు ఆయ‌న చేయ‌ని క‌థ‌, చేయ‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేదు. కానీ ఈ సినిమాతో మ‌ర‌లా అంత‌చేయాల‌నుకోవ‌డం పొర‌పాటే. కొత్త ద‌ర్శ‌కుల‌ను ప్రోత్స‌హించే ర‌వితేజ మ‌రోసారి త‌న‌కు `వీర‌`తో ప్లాప్ ఇచ్చిన ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చారు. అత‌ను ఎక్క‌డా ద‌ర్శ‌క‌త్వం చేసిన అనుభ‌వంలేదు. హాలీవుడ్‌, కోలీవుడ్ సినిమాలు చూసి స్పూర్తి పొందాడు. గ‌త ఏడాదిలో `రాక్ష‌సుడు` అనే సినిమాను త‌మిళ  రాక్ష‌స‌న్‌ను మ‌క్కికి మ‌క్కి తీసి దించేశాడు. దీనిని కోనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మించారు. ఆ సినిమా హిట్ అయింది. అది ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ కాదు. క‌థ‌లో కొత్త‌ద‌నం, క‌థ‌నంలో థ్రిల్ అంశాలు క‌నిపిస్తాయి. 
 
కానీ ఖిలాడి లో అలాంటివి ఏమీ క‌నిపించ‌వు. సినిమా ఆరంభంనుంచి గాంధీ అనే వ్య‌క్తి సొంత త‌ల్లిదండ్రుల‌ను, చిన్న పిల్ల‌ను చంపేసి జైలుశిక్ష అనుభ‌విస్తున్నాడ‌నే కోణంలో వుంటుంది. ఇంట‌ర్ వెల్‌కు అదంతా హుళ‌క్కి. అస‌లు గాంధీ వేరే ఖైదీ. అని జ‌నాల్ని థ్రిల్ చేశామ‌నుకుని ఫూల్స్ చేశాడు. ఇక సెకండాఫ్‌లో కూడా ఎక్క‌డా ఆస‌క్తి క‌నిపించ‌డ‌వు. వేల కోట్ల రూపాయ‌ల కోసం ఇట‌లీ, దుబాయ్ వంటి ప్రాంతాల్లో షూటింగ్ చేసి నిర్మాత లావిష్గా వుంద‌నుకున్నాడు. కానీ ఇలాంటి కోణాన్ని వైజాగ్‌లోనే డ‌బ్బు కంటైన‌ర్‌లో నుంచి మాయం చేయ‌డం వంటివ‌న్నీ అల్లు అర్జున్ జులాయ్‌లో ఆస‌క్తిగా చూపించేశాడు. అలాగే బాలీవుడ్ ధూమ్ సినిమా కూడా ఖిలాడిలో క‌నిపిస్తుంది. అలాగే త‌మిళంలో అజిత్ న‌టించిన ఓ సినిమా ఛాయ‌లు ఇందులో క‌నిపిస్తాయి.
 
ఖిలాడి రొటీన్ ఫార్ములా ఎక్క‌డా కొత్త‌ద‌నం వుండ‌దు. ర‌వితేజ‌కు హీరోయిన్లు, నిర్మాత కొత్త‌వారు కావ‌డ‌మే విశేషం. నిర్మాతైతే యూనివ‌ర్శిటీ అధినేత‌గా సినిమాల‌పై అవ‌గాహ‌న లేక‌పోయినా ఏది హిట్టో ఫ‌ట్టో తెలిసిపోతుంద‌నే ఓవ‌ర్ కాన్‌షిడెన్స్ వున్న‌వ్య‌క్తిలా ప్రీరిలీజ్‌లో క‌నిపించాడు. ఖిలాడిలో మొద‌టినుంచి ఎక్క‌డా ఆస‌క్తి స‌న్నివేశాలు వుండ‌వు. చాలాచోట్ల ప్రేక్ష‌కుల‌కు నీర‌సం వ‌స్తుంది.  ఓ ద‌శ‌లో. ప్రేక్షకులను సైతం ‘ఫూల్స్’ను చేస్తూ అసలు రవితేజ బయటికి వస్తాడు. ఇప్పటిదాకా మీరు చూసిందంతా ట్రాష్ అంటూ పెద్ద ట్విస్ట్ ఇస్తాడు. ఇక్కడ మనకు ‘డార్లింగ్’ సినిమా కనిపిస్తుంది. కానీ ‘డార్లింగ్’లో అప్పటిదాకా చూపించిందంతా అబద్ధం అయినా సరే.. అదొక అందమైన కలలాగా అనిపించి ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ చూసిందంతా నాన్సెన్స్ లాగా అనిపిస్తుంది తప్ప.. ఎంతమాత్రం మంచి ఫీలింగ్ కలగదు.
 
పది వేల కోట్ల రూపాయల డబ్బుతో ముడిపడ్డ వ్యవహారంతోపాటు సి.ఎం. కావాల‌నే రాజ‌కీయ‌కోణంలో క‌థ తీయ‌డం అనుభ‌వం వున్న ద‌ర్శ‌కుడికే చెల్లుతుంది. ఆ విష‌యం చూసిన ప్రేక్ష‌కుడికి ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఇలాంటి క‌థ‌లు ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ఎక్క‌వు.   ముక్కూ ముఖం తెలియని ఇంకో విలన్ని హీరో టెక్నాల‌జీ పేరుతో పట్టేస్తాడు. ఏ పాత్ర నిజ‌మో, అబ‌ద్ధ‌మో క‌న్ఫ్యూజ్‌గా వుంటుంది.  
 
హీరోయిన్లు ఒకరితో ఒకరు పోటీ పడి అందాలు ఆరబోశారు. పాటలన్నీ ఆ కోణంలో మంచి కిక్కే ఇస్తాయి. వారికి తోడు అనసూయ సైతం అనుష్క లాగా పిక్క‌లు బాగా చూపిస్తుంది.  రమేష్ వర్మ కమర్షియల్ సినిమా ఇలా వుంటుంద‌ని ఫిక్స్ అయి తీశాడ‌నే చెప్పాలి. దేవీశ్రీ బాణీలు ప‌ర్వాలేదు అనిపిస్తాయి.  
 
ఫైన‌ల్‌గా చూస్తే, రవితేజ నుంచి ఆశించే స్థాయి వినోదం అయితే ఈ పాత్రలో లేదు. డింపుల్ హయతి గ్యాప్ లేకుండా అందాలు ఆరబోసింది. ఇలాంటి పెద్ద సినిమాల్లో ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో రెచ్చిపోయిన కథానాయిక మరొకరు కనిపించలేదంటే అతిశయోక్తి కాదు. ఐతే ఆమె లుక్స్ యావరేజ్ అనిపిస్తాయి. . పాటలేవీ గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం కమర్షియల్ సినిమాల మీటర్లో సాగిపోయింది. న‌లుగురు కెమెరామెన్లు ప‌నిచేసిన ఈ సినిమాలో  సుజీత్.. జీకే విష్ణుల విజువల్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. భారీ లొకేషన్లలో సినిమా తీయాల్సిన అవ‌స‌రం కూడా క‌నిపించ‌దు. 
ఫైన‌ల్‌గా చెప్పాలంటే, ర‌వితేజ త‌ను ప్రేమిస్త‌న్న‌ట్లు ఆమె తండ్రి ముర‌ళీశ‌ర్మకు అబ‌ద్దాలు చెబుతుంటే ర‌వితేజ‌కే డౌట్ వ‌చ్చి. మీకు అర్థ‌మ‌యింద‌నుకుంటా.. అంటాడు. నువ్వు చెప్పేది క‌న్ ఫ్యూజ్ గా వుందంటాడు ముర‌ళీశ‌ర్మ‌. ఇదే అభిప్రాయం ఖిలాడి చూసిన ప్రేక్ష‌కుడికి క‌లుగుతుంది. ఇది ఎవ‌రేజ్ సినిమా. ప్రేక్ష‌కులు ఏ మేర‌కు ఆద‌రిస్తాడో చూడాల్సిందే.
రేటింగ్‌- 2/5