శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (10:32 IST)

మూడు జంటలను వెంటాడిన మిస్టేక్‌ ఏమిటి? రివ్యూ

Mistake photo
Mistake photo
నటీనటులు: అభిన‌వ్ స‌ర్దార్‌, అజయ్ క‌తుర్‌వ‌ర్‌, సుజిత్, తేజ ఐనంపూడి, క‌రిష్మా కుమార్‌, తానియా క‌ల్రా, ప్రియా పాల్ త‌దిత‌రులు 
సాంకేతికత: సినిమాటోగ్రాఫ‌ర్‌: హ‌రి జాస్తి, సంగీతం: మ‌ణి జెన్నా, ఎడిట‌ర్‌:విజ‌య్ ముక్తావ‌ర‌పు, స్టోరి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  భ‌ర‌త్ కొమ్మాల‌పాటి, నిర్మాత: అభినవ్ స‌ర్దార్‌, నిర్మాణ సంస్థ: ఏఎస్‌పీ మీడియా హౌస్‌. విడుదల తేది: ఆగస్ట్‌ 4, 2023
 
ఇటీవల యూత్ సినిమా కథలు చాల బోల్డ్ గా ఉంటున్నాయి. కరోనా తర్వాత ఓ.టి.టి. కథలు వెరైటీగా వస్తున్న తరుణంలో సినిమాలు కూడా అలాగే ఉంటున్నాయి. బేబీ సినిమా ఇందుకు నిదర్శనం. ఇప్పడు మూడు జంటల కథతో మిస్టేక్‌ చిత్రం వచ్చింది. ఇందులో కొంచెం అనుభవం ఉన్న నటులు నటించారు. మరి వారిని మిస్టేక్‌ ఏమిచేసిందో చూదాం. 
 
కథ:
ముగ్గురు స్నేహితులయిన హెయిర్‌ స్టైలీష్‌ ఆగస్త్య (అజయ్‌ కతుర్‌వర్‌), పూజారి మహదేవ్‌ శర్మ అలియాస్‌ దేవ్‌ (సుజిత్‌ కుమార్‌), కార్తీక్‌(తేజ ఐనంపూడి) ఒకే గదిలో కలిసి ఉంటారు. ఈ ముగ్గురూ వేరువేరు అమ్మాయిలను ప్రేమిస్తారు.ఆగస్త్య ఏసీపీ (రాజా రవీంద్ర) కూతురు మిత్ర(ప్రియా)ను ప్రేమిస్తాడు. దేవ్‌, పార్వతి అలియాస్‌ పారు (నయన్‌ సారికా)ను ప్రేమిస్తాడు. కార్తీక్‌ ముంబైలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణి స్వీటీ(తనియా కార్లా)ని ప్రేమిస్తాడు. అయితే ముగ్గురు చేసిన చిన్న మిస్టేక్ తో  వాళ్ళ ప్రానానికి హాని ఉందని గ్రహించి, దాని నుంచి తప్పుకోవాలంటే వారం పాటు సిటీకి దూరంగా ఫారెస్ట్‌ ట్రిప్‌ వెళ్లాలనుకుంటారు.
 
ఈ దశలో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసి యూనిక్ గా అందరూ ఎరుపు రంగు డ్రెస్ వేసుకుంటారు. అలా జీపులో ఫారెస్ట్‌కి వెళ్తుంటే మార్గ మధ్యలో ఓ రౌడీ (అభినవ్‌  సర్దార్‌) వీరిని వెంటాడి తుపాకీ తో దాడి చేస్తాడు. ఇదంతా ఎవరికీ వారు తాము చేసిన మిస్టేక్ వల్లే ఇలా దాడి జరుగుతుందని భావిస్తారు. ఆ రౌడీ నుంచి తప్పించుకునే క్రమంలో జీపు వదిలి అడవి లో పారిపోతారు. అలా వెళ్లిన వారికి ఎదురైన అనుభవాలే మిగిలిన సినిమా.
 
సమీక్ష:
టైటిల్ తోనే మిస్టేక్‌ వళ్ళ ఏమిజరిగింది అనేదే ముందుగానే దర్శకుడు భరత్‌ కొమ్మాలపాటి ప్రేక్షకులకు హింట్ ఇచ్చాడు. అది చివరివరకు ట్విస్ట్ గా ఉంచి సస్పెన్స్ క్రియేట్ చేసాడు. అడవిలో గిరిజనులు గా పొట్టి మనుషులను పెట్టి ఎంటర్టైన్ చేసాడు. ఒకరకంగా ఇంతవరకు ఎవరు చేయని ప్రయోగం. వారికి పనికలిపించిన దర్శక నిర్మాతలను అభినందించాలి. కథలో ఎక్కువ భాగం వినోదం ఆ ఎపిసోడ్ లో ఉంది. ఇక విలన్ యాక్షన్ పరంగా బాగా చేసాడు. ఆహార్యం బాగుంది. మిగిలిన మూడు  జంటలు బాగున్నారు. వారు ఇప్పటి  ట్రెండ్ కు తగినట్లు బోల్డ్ రొమాన్స్ బాగా చూపించారు. 
 
చిన్న మిస్టేక్ ను కథగా మలిచి, రెండు గంటల పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా నడిపించడం హైలైట్‌ పాయింట్‌. గమనంలో ట్విస్టులలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేసిన రొటీన్గా అనిపిస్తుంది. ఇంతకు ముందు కొన్ని సినిమాల్లో చూసిన ట్వీస్టులు ఇందులో కనిపిస్తాయి. ఈ విషయమ్లో కాస్త హోంవర్క్ చేయాలిసింది. రౌడీని రాజా రవీంద్ర కాల్చి వేసి వాంటెడ్ క్రిమినల్ కనుక 10 లక్షలు మూడు జంటలకు ఇస్తానని చెపుతాడు. కట్ చేస్తే.. అతను బతికి సీక్వెల్ కు హింట్ ఇస్తాడు. 
 
సినిమా మొత్తం మూడు జంటలు, ఓ విలన్‌, అడవిలోనే సాగుతుంది. ఫస్టాఫ్‌లో మూడు జంటల చేసే పనులు అన్ని సరదాగా సాగుతూ వినోదాన్ని పంచుతాయి. అదే సమయంలో కొన్ని సన్నివేశాలు ఉత్కంఠభరితంగాను సాగుతాయి. కొన్ని డైలాగులు చాల బోల్డ్ గా చెప్పడంతో  ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిగా అనిపిస్తాయి. ఇంటర్వెల్‌ ముందే మిస్టేక్ ట్విస్ట్‌ని రివీల్‌ చేయడంతో ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంటుంది. క్లైమాక్స్‌ ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.
 
అందరూ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూజారి దేవ్‌ పాత్ర అల్లు అర్జున్ నటించిన సినిమాలో స్లాంగ్ కనిపిస్తుంది. రాజా రవీంద్ర, సమీర్‌ పాత్రలు బాగున్నాయి. సంగీతం సందర్భానుసారం గా ఉంది.. మంగ్లీ పాడిన పాట వినసొంపుగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌ హరి జాస్తి పనితీరు బాగుంది. ఎడిటర్‌  విజయ్‌ ముక్తావరపు తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సరదాగా టైం పాస్ సినిమా గా చూడొచ్చు. ప్రేక్షకుల తీర్పు మేరకు ఆదరణ ఉంటుంది. 
రేటింగ్: 2.75/5