మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 మే 2020 (11:53 IST)

కరోనా వైరస్ హాట్‌స్పాట్‌గా చెన్నై కోయంబేడు మార్కెట్

దేశంలోనే అతిపెద్ద కూరగాయల మార్కెట్‌గా ప్రసిద్ధికెక్కిన చెన్నై కోయంబేడు మార్కెట్ ఇపుడు వార్తల్లో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించడానికి హాట్ స్పాట్‌గా ఈ మార్కెట్ నిలిచినట్టు భావిస్తున్నారు. ఇక్కడ పని చేసే కూలీలకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 527 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఈ మార్కెట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. 
 
అంతేకాకుండా, ఈ కోయంబేడు మార్కెట్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివశిస్తున్న వారికి హెల్త్ వర్కర్లు కరోనా పరీక్షలు చేస్తున్నారు. ముఖ్యంగా, కోయంబేడు మార్కెట్‌కు వచ్చి వైరస్ బారినపడిన వారి వివరాలను సేకరిచే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా, ఈ మార్కెట్‌లో కూలీలుగా పని చేస్తూ వైరస్ బారినపడినవారిలో చెన్నై జిల్లాకు చెందిన 266 మంది కూలీలు ఉన్నారు. 
 
అలాగే, కడలూరు జిల్లాకు చెందిన కూలీలు 122 మంది, విళుపురంకు చెందినవారు 49, పెరంబలూరుకు చెందినవారు 25, తిరువణ్ణామలైకు చెందినవారు 11, దిండిగల్‌కు చెందినవారు 10, తెన్‌కాశి, తిరువళ్లూరు జిల్లాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. కాగా, ప్రస్తుతం తమిళనాడులో మొత్తం కరోనా కేసులు 3550గా నమోదైవుంది.