శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (11:04 IST)

బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు సాగిన గద్దర్ ప్రయాణం...

gaddar
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ శకం ముగిసింది. బుల్లెట్ నుంచి బ్యాలెట్ వరకు ఆయన ప్రయాణం సాగింది. కేవలం సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని విశ్వసించిన వ్యక్తి... చివరిక ప్రజాస్వామ్య పరిరక్షణ (సేవ్ డెమొక్రసీ)కి నడుం బిగించి, ఏకంగా సొంత పార్టీనే స్థాపించారు. 
 
పీపుల్స్‌వార్‌, మావోయిస్టు పార్టీ, తెలంగాణ ఉద్యమం.. ఇలా అనేక ఉద్యమాల్లో పాల్గొన్న గద్దర్... తన ప్రసంగాలు, పాటలతో కోట్లాది మందిని ఉత్తేజపరిచారు. చైతన్య పరిచారు. అప్పట్లో తుపాకీ చేతపట్టి ఉద్యమాలు చేసిన గద్దర్.. ప్రజాస్వామ్య పండుగగా చెప్పుకొనే ఎన్నికల్లో (ఐదు దశాబ్దాల్లో) ఎన్నడూ ఓటు వేయలేదు. 
 
అలాంటి వ్యక్తి ఏకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్నే చేపట్టారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో తొలిసారి ఓటేసిన ఆయన.. చివరకు స్వయంగా రాజకీయ పార్టీనీ స్థాపించారు. ఇలా ఒకప్పుడు ఎన్నికలను బహిష్కరించాలన్న ఆయన 'బుల్లెట్‌ నుంచి బ్యాలెట్‌' వరకు సాగిన ప్రయాణాన్ని పరిశీలిస్తే..
 
1980ల్లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన గద్దర్‌.. జన నాట్యమండలిని స్థాపించారు. సాయుధ పోరాటం ద్వారానే రాజ్యాధికారం సాధించవచ్చని ప్రజలను చైతన్యవంతం చేసేవారు. తన ప్రసంగాలు, పాటలతో గ్రామీణ ప్రాంత ప్రజలను ఉత్తేజపరిచేవారు. చివరకు ఆ బృందాన్ని పీపుల్స్‌ వార్‌లో.. ఆ తర్వాత మావోయిస్టు పార్టీలో విలీనం చేశారు. 
 
అనంతరం ఆయనపై హత్యాయత్నం జరగడంతో కొంతకాలం అన్నింటికీ దూరంగా ఉన్నారు. 2009లో మలిదశ తెలంగాణ ఉద్యమం మరోసారి ఊపందుకుంది. ఆ సమయంలో తన గళానికి మళ్లీ ఊపిరిపోసిన ఆ యుద్ధనౌక.. ఏడు పదులు వచ్చే వరకూ ఎన్నడూ ఓటెయ్యలేదు. చివరకు 2018లో ఎన్నికల సమయంలో తొలిసారి ఓటరుగా నమోదు చేసుకొన్నారు. అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డిసెంబర్‌ 7న తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 
ఆ తర్వాత కూడా రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ఉద్యమాన్ని కొనసాగించిన గద్దర్‌.. మావోయిస్టులూ తమ వ్యూహాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తుపాకులను ఆశ్రయించకుండా బ్యాలెట్‌ను వినియోగించాలని అన్నారు. అంబేడ్కర్‌ రచించిన ‘రాజ్యాంగం’ ద్వారానే బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కుతుందని ప్రచారం చేశారు. దేశ రాజకీయాలు కులం, మతం చుట్టూ తిరుగుతున్నాయని వాపోయారు. రాజకీయం అంటే అన్యాయాన్ని, దౌర్జన్యాన్ని అణచివేసే ఓ శక్తి అని.. అదే తలవంచితే సమాజానికి అన్యాయం జరుగుతుందని అనేక సందర్భాల్లో చెప్పారు.
 
ఇలా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసిన గద్దర్‌.. ఏకంగా రాజకీయ పార్టీనే స్థాపించారు. 'గద్దర్‌ ప్రజా పార్టీ' అనే పేరు పెట్టిన ఆయన.. గద్దర్‌ అంటే ఓ విప్లవమని.. ఇది ప్రజా యుద్ధమని వివరణ ఇచ్చారు. త్వరలోనే తమ పార్టీకి గుర్తింపు వస్తుందన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. 
 
ప్రతి ఇంటినీ ఓ ఎన్నికల కేంద్రం చేయాలని.. ఓటు విలువ తెలియజెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయాలు.. పార్లమెంటరీ వ్యవస్థలో కనిపిస్తోన్న మార్పులే తనను ఉద్యమం నుంచి ఓట్ల విప్లవం వైపు అడుగులు పెట్టేలా చేయశాయన్నారు. అందుకే ఓట్ల విప్లవానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చేవారు. కానీ, అంతలోనే ఆయన తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.