గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (15:44 IST)

మూగబోయన ప్రజాగళం... : ప్రజాగాయకుడు గద్దర్ ఇకలేరు

gaddar
ప్రజా గాయకుడు గద్దర్‌ ఇకలేరు. ఆయన వయసు 74 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇండో అమెరికన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని ఓ హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇంతలోనే ఆయన కన్నుమూయడం బాధాకరం. 
 
ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. ఆయన పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారు. ఆయా సమయాల్లో ఆయన చురుకైన పాత్రను పోషించారు. గద్దర్‌ 1949లో తూఫ్రాన్‌లో జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు. 
 
1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చిన గద్దర్‌. నీ పాదం మీద పుట్టుమచ్చనై పాటకు నంది అవార్డు అందుకున్నారు. అయితే, నంది అవార్డును తిరస్కరించారు.