గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2023 (19:53 IST)

ప్రజా యుద్ధ నౌక ఆగింది... ప్రముఖుల నివాళులు

gaddar
ప్రజా యుద్ధ నౌకగా గుర్తింపు పొందిన గద్దర్ ఇకలేరు. ఆయన ఆదివారం మృత్యువాతపడ్డారు. ఆయన మృతిపై పలువురు రాజకీయ నేతలు తమ ప్రగాఢ సంతాపాలను తెలుపుతున్నారు. ఇదే అంశంపై పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ. 'ప్రజా గాయకుడు' గద్దర్ మృతి పట్ల నా సంతాపం తెలియచేస్తున్నాను. తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన 'ప్రజా యుద్ధనౌక' గద్దర్.
 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, తన గళంతో ప్రజలను కదిలించిన గద్దర్ మృతితో ప్రజా ఉద్యమాల్లో... పౌరహక్కుల పోరాటాల్లో... ఒక శకం ముగిసినట్లు అయ్యింది. గద్దర్ కుటుంబసభ్యులకు నా సానుభూతి… ప్రజా గాయకుడు, ఉద్యమకారుడు గద్దర్ గారి మరణం తీవ్ర విషాదకరం. తన పాటలతో, మాటలతో తెలంగాణ ఉద్యమాన్ని సైతం ఉత్తేజపరిచిన విప్లవ వీరుడి మరణం సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులు అర్పిస్తూ, ఆయన కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.
 
తెలంగాణ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ, "ప్రజా యుధ్ధ నౌకగా పేరుగాంచిన కవి, రచయిత గద్దర్ మృతి బాధాకరం. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా, తనదైన పాటలతో అందరినీ కదిలించిన ప్రజాగాయకుడు. 'అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా' అంటూ, 'పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా' అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్ల మందిని ఉత్తేజపరిచిన ప్రజా గొంతుక గద్దర్. ఆయన మృతి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు. 
 
మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ, గద్దర్ గళం అజరామరం. ఏ పాట పాడినా, దానికో ప్రజా ప్రయోజనం ఉండేలా గొంతు ఎత్తి పోరాడిన ప్రజా గాయకుడు, 'ప్రజా యుద్ధ నౌక' గద్దరన్నకి లాల్ సలాం! సరళంగా ఉంటూనే అత్యంత ప్రభావవంతమైన తన మాటల పాటలతో దశాబ్దాల పాటు ప్రజల్లో స్ఫూర్తిని రగిల్చిన గద్దరన్న ఇక లేరు అనే వార్త తీవ్ర విషాదాన్ని కలుగజేసింది. ప్రజా సాహిత్యంలో, ప్రజా ఉద్యమాలలో ఆయన లేని లోటు ఎప్పటికీ పూడనిది. పాటల్లోనూ, పోరాటంలోనూ ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షలాది ఆయన అభిమానులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాడ సంతాపం! అని పేర్కొన్నారు. 
 
నారా లోకేశ్ స్పందిస్తూ, 'ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజాయుద్ధ నౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే..' అంటూ పేర్కొన్నారు.