ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : ఆదివారం, 4 ఆగస్టు 2019 (11:36 IST)

తెల్ల జెండా చూపించి... మీ సభ్యుల మృతదేహాలు తీసుకెళ్లండి : పాక్‌కు భారత ఆర్మీ సూచన

జమ్మూకాశ్మీర్ లోయలో చొరబాటుకు పాకిస్థాన్ ప్రేరేపితి ఉగ్రవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ చొరబాటును భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టారు. పైగా, నియంత్రణ రేఖ వెంబడి జరిగిన కాల్పుల్లో ఐదు నుంచి ఏడుగురు పాక్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌(బీఏటీ) సభ్యులతో పాటు ఉగ్రవాదులు కూడా మృతిచెందారు. ఈ ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న వారి మృతదేహాలు అక్కడే పడి ఉబ్బిపోతున్నాయి. 
 
అదేసమయంలో పాకిస్థాన్ వైపు నుంచి చొరబాటు యత్నాలు కూడా ఎక్కువయ్యాయి. దీంతో భారత సైన్యం కూడా నియంత్రణ రేఖ వెంబడి గస్తీని మరింత ముమ్మరం చేసింది. ఈ పరిస్థితుల్లో భారత ఆర్మీ ఓ కీలక ప్రకటన చేసింది. నియంత్రణ రేఖ వద్ద చనిపోయినవారి మృతదేహాలను తీసుకెళ్లాల్సిందిగా పాక్‌ను కోరింది. ఇందుకోసం ఎటువంటి హింసకు పాల్పడకుండా తెల్లజెండాలు చూపించి భారత భూభాగం వైపు రావాలని సూచించింది. అయితే భారత సూచనపై ఇప్పటివరకు పాక్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.
 
కాగా, జమ్మూకాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా కేరన్‌ సెక్టార్‌లో జూలై 31వ తేదీ అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుందని ఆర్మీ అధికార ప్రతినిధి కల్నల్‌ రాజేశ్‌ కాలియా తెలిపారు. వీరిలో నలుగురు పాక్‌ సైనికులతో పాటు, ఉగ్రవాదులు కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. మరోవైపు కశ్మీర్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అమర్‌నాథ యాత్రికులను, సందర్శకులను తమ స్వస్థలాలకు పంపించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.