శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Modified: శనివారం, 27 జులై 2019 (20:12 IST)

కార్గిల్ స్పెషల్: యుద్ధంలో పాక్ సైనికులకు ఆహారం అందించిన వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారు?

''1999 మేలో నేను జగ్లోట్ (గిల్జిత్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న గ్రామం) నుంచి నా వాహనంలో వెళుతుండగా కారకోరం దారిలో ఓ గుంపు ఉండటం గమనించాను. పాకిస్తాన్ ఆర్మీకి అనుకూలంగా వారు నినాదాలు చేస్తున్నారు.''


''పదుల సంఖ్యలో ప్రజలు స్థానిక ఆసుపత్రిలో ఉండటం చూశాను. పర్వతాల వద్ద గాయపడిన సైనికులకు వారు ఆ ఆసుపత్రిలో రక్తదానం చేస్తున్నారు.'' గుల్షర్ (అతని గుర్తింపును కాపాడటానికి పేరు మార్చాం)‌కు ప్రస్తుతం 50 ఏళ్లు. ఆయన కార్గిల్ యుద్ధం తాలుకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిరుత్సాహపడుతుంటారు. బీబీసీ స్వతంత్రగా ఈ వివరాలను నిర్ధారించలేదు.

 
1999 ఏప్రిల్‌లో కార్గిల్ పట్టణానికి సమీపంలో ఉన్న నియంత్రణ రేఖ వెంట పహారా కాస్తున్న భారత సైనికులు పర్వతాల పైనుంచి కాల్పులు జరిపారు. కొన్నిరోజుల తర్వాత, చలి తీవ్రత పెరగడంతో అక్కడున్న క్యాంపుల నుంచి భారత ఆర్మీ ఖాళీ చేసింది. దీంతో ఆ స్థానాలను పాక్ నుంచి వచ్చిన చొరబాటుదారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఇలా స్వాధీనం చేసుకున్నవారు పాక్ ఆర్మీకి చెందినవారని భారత సైన్యం గ్రహించింది. దీంతో చొరబాటుదారులను ఖాళీ చేయించేందుకు భారత ఆర్మీ భారీ బలగాలతో ముందుకువచ్చింది. ఈ ఆపరేషన్ దాదాపు మూడు నెలలు జరిగింది. కార్గిల్ యుద్ధం సమయంలో గుల్షర్ పాకిస్తాన్ మిలిటరీలో వాలంటీర్‌గా, కమ్యూనిటీ మొబలైజర్‌గా పనిచేశారు. వందల ఏళ్ల కిందట గుల్షర్ పూర్వికులు శ్రీనగర్ నుంచి గిల్ఘిత్‌కు వలస వచ్చారు. తమకు కశ్మీర్‌తో బలమైన అనుబంధం ఉందని గుల్షర్ చెప్పారు.

 
1987లో గుల్షర్ పాక్ ఆర్మీలో శిక్షణ తీసుకున్నారు. తర్వాత పాక్ ఆర్మీకి చెందిన ముజాహిద్ రెజిమెంట్‌ జన్బాజ్ దళంలో పనిచేశారు. ఐదేళ్లు చేశాక అనారోగ్య కారణాలతో మిలటరీ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. అయితే, ఇండియా నుంచి కశ్మీర్‌ను రక్షించవచ్చనే ఉద్దేశంతో కార్గిల్ యుద్ధం మొదలైనవెంటనే తాను మళ్లీ మిలటరీలో చేరాలని నిర్ణయించుకున్నానని గుల్షన్ చెప్పారు.

 
''యుద్ధం సమయంలో నేను ఖప్లులోని బేస్‌క్యాంపునకు వెళ్లేవాడ్ని. ఇది స్కర్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండేది. యుద్ధంలో మాతో పాటు చాలా మంది ప్రజలు కూడా చేరారు. అందులో ఎక్కువ మంది కశ్మీరీలే. కొందరు పాకిస్తాన్ వాళ్లు కూడా ఉన్నారు'' అని ఆయన చెప్పారు. కార్గిల్ యుద్ధం సమయంలో గిల్ఘిత్ బల్టిస్తాన్ ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారని గుల్షన్ చెప్పారు. తమ సొంత వాహనాలను కూడా వారు ఆర్మీ కోసం వినియోగించారని, పాక్ సైన్యానికి తమ వాహనాల్లో ఆహారపదార్థాలు, ఇతర సామానులను ఉచితంగా అందజేశారని తెలిపారు.

 
యుద్ధం సమయంలో గుల్షన్ పాక్ ఆర్మీకి చెందిన ఖప్లు క్యాంపులో వాలంటీర్‌గా చేరారు. సరిహద్దులోని రషీద్ పోస్ట్‌లో దాదాపు మూడు నెలలు పనిచేశారు. అక్కడున్న పాక్ సైన్యానికి తన వాహనంలో నిరంతరాయంగా ఆహారం, ఇంధనాన్ని సరఫరా చేశారు. ''భారత సైనికులు భారీ ఆయుధాలు ఉపయోగించారు. దీంతో పాక్ వైపు ఉన్న నిర్మాణాలు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్నిసార్లు భారత ఆర్మీ దాడులు తప్పించుకొని బయటపడ్డాను. ఒకసారి నా కారు దాడుల మధ్య చిక్కుకపోయింది. ఐదు రోజుల పాటు అక్కడి నుంచి కదలలేకపోయాను. రోడ్డు పునర్ నిర్మాణం తర్వాతే అక్కడి నుంచి బయటపడ్డాను'' అని గుల్షన్ చెప్పారు.

 
''మా వైపు భారీగా ప్రాణనష్టం జరిగింది. ముఖ్యంగా 6 & 14 ఎన్‌ఐఎల్ క్యాంపుకు పెద్ద దెబ్బ తగిలింది'' అని ఆయన తెలిపారు. కార్గిల్ యుద్ధంపై పాకిస్తాన్ సైన్యం స్పందన కోసం బీబీసీ వారిని సంప్రదించింది. వారి నుంచి స్పందన వస్తే ఈ కథనాన్ని అప్‌డేట్ చేస్తాం. గిల్ఘిత్‌లో వాతావరణం గడ్డకట్టుకపోతుంది. మరోవైపు ఆ చుట్టపక్కల ఉన్న రహదారులు భారత సైన్యం కాల్పులకు ధ్వంసమయ్యాయి. కమ్యూనికేషన్ దెబ్బతింది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడున్న పర్వతాల్లో నెలలతరబడి పహారాకాయడం పాక్ సైన్యానికి సవాలుగా మారింది.

 
''ఆ సమయంలో మా క్యాంపులోని సైన్యానికి రెండు రోజుల పాటు తిండి కూడా దొరకలేదు'' అని గుల్షన్ చెప్పారు. '' మేం స్వాధీనం చేసుకున్న ఒక పాయింట్ రషీద్ పోస్ట్ నుంచి దాదాపు వంద అడుగుల ఎత్తులో ఉంది. నేను అక్కడే ఉన్నాను. రాత్రిళ్లు వేరే వైపు నుంచి మేం రహస్యంగా ఆహారం, నీళ్లు అక్కడికి తీసుకెళ్లేవాళ్లం. దాదాపు 30 కేజీల బరువును మోసుకుంటూ వెళ్లేవాళ్లం. కాల్పుల విరామం సమయంలో మాతో పాటు తెచ్చిన ఆహార పదార్థాలను సైన్యానికి అందించేవాళ్లం'' అని గుల్షర్ గుర్తు చేసుకున్నారు.

 
అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిళ్లు రావడంతో జులై 4న పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, భారత్ పాలిత కశ్మీర్‌లోని తన సైన్యాన్ని వెనక్కిరప్పించేందుకు అంగీకరించారు. రాజకీయ నాయకత్వం తీసుకున్న ఉపసంహరణ నిర్ణయానికి గుల్షర్ ఇప్పటికీ చింతిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్ భారీ నష్టాలను చూసిందని ఆయన భావిస్తున్నారు. కాల్పుల ప్రతిష్టంభన సమయంలో 1000 మంది పాక్ సైనికులు మరణించారని అతని అంచనా.

 
''మేం చాలా గొప్పగా ప్రేరణపొందాం. శ్రీనగర్‌కు చేరుకోగలమని విశ్వసించాం. కానీ, వనరులు లేకపోవడం మా(పాక్) దురదృష్టం. పూర్తిస్థాయి యుద్ధం చేయడానికి, అంతర్జాతీయ ఒత్తిళ్లు తట్టుకోడానికి కావాల్సిన నిధులు మా వద్ద లేవు. అందుకే బలవంతంగా యుద్ధ విరమణ చేయాల్సి వచ్చింది'' అని గుల్షర్ చెప్పారు.

 
కాల్పుల విరమణ తర్వాత పాక్ ప్రభుత్వం జవాన్ల మృతదేహాలను తీసుకోడానికి నిరాకరించిందనే వార్తలను ఆయన ఖండించారు. ''పాక్ ఆర్మీకి చెందిన వారి మృతదేహాలను తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. నార్తెర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీ మృతదేహాలను వారి కుటుంబాలకు సైనిక లాంచనాలతో అప్పగించింది'' అని ఆయన తెలిపారు. తమ భూభాగం నుంచి పాక్ సైన్యాన్ని పూర్తిగా తరిమికొట్టామని జులై 26న భారత సైన్యం ప్రకటించింది.

 
ఆపరేషన్‌కు సంబంధించిన రవాణా అంశాలను పాకిస్తాన్ అధికారులు మరింత మెరుగ్గా అమలు చేసి ఉండాల్సిందని గుల్షర్ అభిప్రాయపడ్డారు. ''ఈ యుద్ధం ఎందుకు వచ్చిందో నాకు కచ్చితంగా తెలియదు. నేను స్వచ్ఛంద కార్యకర్తను మాత్రమే. ఇప్పుడు కూడా ఏదైనా విపత్తు వస్తే నా సేవలు అందించడానికి సిద్ధం'' అని ఆయన పేర్కొన్నారు. 1999 ఏప్రిల్‌లో కార్గిల్ యుద్ధం మొదలైంది. భారత్, పాక్ మధ్య కాల్పులు విరమణ పూర్తిస్థాయిలో జరిగాక దాదాపు ఆరు నెలలకు ఘర్షణ సద్దుమణిగిందని గుల్షర్ తెలిపారు.