బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శనివారం, 8 సెప్టెంబరు 2018 (13:40 IST)

అది కల్వకుంట్ల వారి ఇల్లు కాదు.. ఎర్రబెల్లి తీపి.. మేము చేదయ్యామా? : కొండా సురేఖ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. తమకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించకపోవడంపై ఆమె మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌పై ఆ పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత, మాజీ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. తమకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించకపోవడంపై ఆమె మండిపడ్డారు. తెలంగాణ అంటే కల్వకుంట్ల ఇల్లు కాదంటూ ఆగ్రహించారు. తెరాస చీఫ్ కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితాలో తన పేరు లేకపోవడం చాలా బాధ కలిగించిందన్నారు.
 
ఆమె శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, వరంగల్ తూర్పు నియోజవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచిన తనను ఆ జాబితాలో ప్రకటించకపోవడం బాధాకరమన్నారు. బీసీ మహిళనైన తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. 105 మంది జాబితాలో తన పేరు ప్రకటించకపోవడానికి కారణాలేంటని ఆమె నిలదీశారు. 
 
గత ఎన్నికల సమయంలో చాలాసార్లు తమకు వర్తమానం పంపారని...అయితే పరకాల సీటు ఇస్తేనే టీఆర్‌ఎస్‌లోకి వస్తామని తాము తెల్చిచెప్పామని అన్నారు. అందుకు కేసీఆర్ అంగీకరిస్తూ తనకు మంత్రి పదవి, కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారని ఆమె గుర్తుచేశారు. వరంగల్‌ తూర్పు నుంచి భారీ మెజార్టీతో గెలిచానని ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. 
 
తొలి జాబితాలో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించకపోవడం అమానించడమే అని అన్నారు. టీఆర్‌ఎస్‌లో తాము చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వని ప్రభుత్వంగా టీఆర్ఎస్ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏనాడు మాట్లాడలేదన్నారు. గతంలోనూ తాను మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినట్టు ఆమె గుర్తుచేశారు. 
 
ఇకపోతే, తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదంటూ తమకు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచే సత్తా ఉందని స్పష్టంచేశారు. తనకు టికెట్ ఇవ్వకపోవడానికి కేటీఆరే కారణమని... తమని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్నదీ కేటీఆరే అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌లో కేటీఆర్ కోటరీని తయారు చేసుకుంటున్నారని... తెలంగాణను ఆగం పట్టించేందుకు ఒక టీమ్‌ను తయారు చేస్తున్నారన్నారు. తమకు డబుల్‌ గేమ్‌ ఆడాల్సిన అవసరం లేదని కొండా సురేఖ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
 
తాను బీసీ మహిళను కావడం వల్లే అవమానం చేశారన్నారు. అసలు తెరాస పార్టీలో బీసీ, ఎస్సీ మహిళలకు ఎందుకు అన్యాయం చేస్తున్నారంటూ నిలదీశారు. టీఆర్‌ఎస్‌ గుర్తుపైనే గెలిచిన తాము చేదు అయ్యామని... కానీ టీడీపీ నుంచి వచ్చిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎందుకు తీపి అయ్యారంటూ ఆమె తెరాస అధిష్టానాన్ని నిలదీశారు. ఎర్రబెల్లికి తనకు పడదని తెలిసినప్పటికీ ఆయన్ని టీఆరెస్‌లో చేర్చుకున్నారని, ఈ విషయంలో తమను కనీసం సంప్రదించలేదని ఆవేదన చెందారు. టీఆరెస్ టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేల రిపోర్ట్‌ బయటపెట్టాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.