బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 5 జనవరి 2019 (11:55 IST)

శబరిమల ఆలయంలోకి శశికళ - సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్

శబరిమల ఆలయంలోకి శశికళ ప్రవేశించింది. అదేంటి... శశికళ బెంగుళూరు జైలులో ఉన్నారు కదా.. శబరిమల ఆలయంలోకి ఎలా వెళ్లారన్నదే కదా మీ సందేహం. ఈమె ఆ శశికళ కాదు. శ్రీలంక శశికళ. వయసు 47 యేళ్లు. ఈమె గురువారం రాత్రి శబరిమల అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులు రిలీజ్ చేశారు.
 
అయ్యప్ప దర్శనానికి శ్రీలంక దేశానికి చెందిన 47 యేళ్ళ శశికళ అనే మహిళ శబరిమలకు వచ్చారు. ఆమెను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలీసులు ఆలయంలోకి తీసుకెళ్లారు. దీంతో గురువారం రాత్రి ఆమె స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయితే, ఆమె స్వామివారిని దర్శనం చేసుకున్నారా? లేదా? అనే అంశంపై గందరగోళం నెలకొంది. 
 
దీనిపై కేరళ పోలీసులు స్పందించారు. శ్రీలంక మహిళ ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధృవీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్‌తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీలో కనిపిస్తోంది.

దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. ఇద్దరు మహిళలు బుధవారం దేవాలయం లోపలికి ప్రవేశించడంపై రాష్ట్రమంతా ఆందోళన సాగిననాడే మరో మహిళ (శశికళ) ఆలయంలోకి వెళ్లి అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేయడం గమనార్హం.