మంగళవారం, 26 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 ఆగస్టు 2022 (15:41 IST)

క్షణాల్లో నేలకూలిన ట్విన్ టవర్స్... ఖర్చు రూ.20 కోట్లు

noida twin towers
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నోయిడాలో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ట్విన్ టవర్స్‌ను ఆదివారం కూల్చివేశారు. ఈ టవర్స్ కూల్చివేతకు 3700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించారు. మూడేళ్లపాటు శ్రమించిన నిర్మించిన ఈ టవర్స్‌ను కేవలం 9 సెకన్లలో కూల్చివేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. 
 
గత 2009లో సూపర్ టెక్ లిమిటెడ్ కంపెనీ ఈ ట్విన్ టవర్స్‌ను రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాతిపదికన నిర్మించింది. ఇందుకోసం మొత్తం రూ.70 కోట్లను ఖర్చు చేసింది. మూడేళ్ల కాలంలో నిర్మాణం పూర్తి చేసింది. ఈ జంట భవనాలు అపెక్స్ టవర్ ఎత్తు 102 మీటర్లు కాగా ఇందులో 30 అంతస్తులు ఉన్నాయి. సియాన్ టవర్స్ ఎత్తు 95 మీటర్లు కాగా, ఇందులో 915 ఫ్లాట్స్, 21 షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయి. 
 
అయితే, నిబంధనలు ఉల్లంఘించి ఈ టవర్స్ నిర్మించారంటూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ఈ ట్విన్ టవర్స్‌ను కూల్చి వేయాలని గత యేడాది సంచలన తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు గ్రేటర్ నోయిడా అధికారులు చర్యలు చేపట్టారు. 
 
ఇందులోభాగంగా, ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతాల్లో ఈ టవర్స్‌ను కూల్చివేశారు. ఇందుకోసం 3700 కేజీల పేలుడు పదార్థాలను వినియోగించి, కేవలం 9 సెకన్లలో కూల్చివేశారు. ప్రైమరీ బ్లాస్ట్‌కు 7 సెకన్ల సమయం పట్టగా, సెకండరీ బ్లాస్ట్ కేవలం 2 సెకన్ల సమయం మాత్రమే పట్టింది. 
 
ఈ టవర్స్‌ నిర్మాణానికి 70 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. కుతుబ్ మినరా, ఇండియా గేట్ కంటే ఎత్తయిన ఈ భారీ టవర్స్‌ను కూల్చివేసేందుకు అధికారులు రూ.20 కోట్ల ఖర్చు చేశారు. ఈ మొత్తంలో రూ.13.5 కోట్లను శిథిలాల తొలగింపునకే కాంట్రాక్ట్ కుదుర్చుకోవడం గమనార్హం.