సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (10:16 IST)

ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ.. తెలంగాణ జన సమితి

తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెట్టారు. ఈయన పార్టీ పేరును తెలంగాణ జన సమితిగా చెప్పారు. టీజేఏసీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక న్యాయవాది పేరుమీద ఈ పార్టీ రిజిస్ట్ర

తెలంగాణ ఐకాస ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ పెట్టారు. ఈయన పార్టీ పేరును తెలంగాణ జన సమితిగా చెప్పారు. టీజేఏసీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక న్యాయవాది పేరుమీద ఈ పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం కొంతకాలం క్రితం దరఖాస్తు చేశారు. తెలంగాణ జన సమితి పేరుతో పార్టీ ఏర్పాటు చేసుకుంటామంటూ చేసిన దరఖాస్తుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. 
 
పార్టీ పేరును సోమవారం (ఈ నెల 2న) కోదండరాం స్వయంగా ప్రకటించనున్నారు. ఇక పార్టీ ఆవిర్భావ సభను ఈ నెల 29న నిర్వహించాలని నిర్ణయించారు. సరూర్‌నగర్‌ క్రీడా మైదానంలో సభ నిర్వహించుకునేందుకు అనుమతి కోరుతూ రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను కోదండ సన్నిహితులు శనివారం కలిశారు.
 
మరోవైపు పార్టీ సంస్థాగత బలోపేతంపైనా ఆయన దృష్టి సారించారు. నిధుల సమీకరణ కోసం కూడా కసరత్తు ప్రారంభించారు. కాగా పార్టీ జెండా, కండువాను ఈ నెల 4న కోదండ ఆవిష్కరించనున్నారు. పార్టీ జెండాను ప్రజలే ఎంపిక చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మూడు జెండా నమూనాలను విడుదల చేశారు. వాటిలోనుంచి ఒకదానిని ఎంపిక చేయాలని కోరారు. 
 
టీజేఎస్ జెండాలో పాలపిట్ట రంగు, ఆకుపచ్చ, పసుపు పచ్చ, తెలుపు, ఊదా రంగులను వాడారు. జెండా మధ్యలో అమరుల స్తూపానికి జనం నివాళి అర్పించడం, బతుకమ్మ ఆడుతున్న ఆడ పడుచులు, ఉదయిస్తున్న సూర్యుడి వెలుగులో ప్రగతి పథంలో పయనిస్తున్న తెలంగాణ జనం, తెలంగాణలో పండుగలకు జనం గుమిగూడి ఆడుకునే ఆనవాయితీ, ప్రతి రోజూ వాకిట్లో వేసుకునే ముగ్గు వంటి వాటిని రూపొందించారు.