జనసేనలోకి నాగబాబు... నరసాపురం ఎంపీ అభ్యర్థిగా...!
మెగా బ్రదర్ నాగబాబు జనసేన పార్టీలో క్రియాశీలకంకానున్నారు. ఇంతకాలం ఆయన తెర వెనుక జనసేన పార్టీకి తరపున రాజకీయాలు చేస్తూ వచ్చారు. కానీ, ఇపుడు క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నారు.
వచ్చే నెలలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో నాగబాబు నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
జనసేన పార్టీలోకి నాగబాబు ఎంట్రీతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. మెగా ఫ్యామిలీ నుంచి పోటీకి కూడా దిగుతుండటంతో అందరిలో ఆసక్తి నెలకొంది. నరసాపురం ఎంపీ స్థానం నుంచి టీడీపీ తరపున బీవీ.శివరాంరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున రఘురాం కృష్ణంరాజు బరిలో ఉన్నారు. వీళ్లతో నాగబాబు ఢీకొట్టనున్నారు.
నరసాపురం నుంచి కొణిదెల నాగబాబు పోటీతో.. ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. ఇద్దరు ఉద్దండులతో ఎన్నికల యుద్ధానికి దిగుతున్న నాగబాబు.. జనసేన జెండాను ఎగరేస్తారా లేదా అనేది ఇపుడు ఆసక్తికర చర్చగా మారింది.
కాగా, నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోకి నర్సాపురం, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, ఆచంట అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఇందులో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న విషయం తెల్సిందే.