శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 జూన్ 2022 (11:45 IST)

ఆత్మకూరు బరిలో 14 మంది అభ్యర్థులు.. అయినా గెలుపు ఏకపక్షమే..

election evm
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయినప్పటికీ ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగనున్నాయి. దీనికి కారణం ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు పోటీకి దూరంగా ఉండటం.
 
ఈ స్థానం ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్న మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల కోసం మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో 13 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 
 
అయితే, నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజైన గురువారం బొర్రా సుబ్బారెడ్డి అనే వ్యక్తి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దీంతో తుది పోరులో 14 మంది అభ్యర్థులు నిలిచారు. ఈ స్థానానికి ఈ నెల 23వ తేదీ పోలింగ్ జరుగనుండగా, 26వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. 
 
ఈ ఎన్నికల బరిలో ఉన్న వారిలో వైకాపా అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ తరపున భరత్ కుమార్, బీఎస్పీ తరపున నందా ఓబుల్‌లు ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలు పోటీకి దూరంగా ఉన్నాయి. 
 
కాగా, ఈ నియోజకవర్గంలో మొత్తం 2,13,330 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు, కరోనా బాధితులు పోస్టల్ బ్యాలెట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకునే వెసులుబాటును కల్పించారు.