ఏపీలో వైద్య విద్యా విప్లవం... ఇక మెడికల్ సీట్లకు ఢోకా లేదు!
దేశ చరిత్రలో మొదటిసారిగా, ఆంద్రప్రదేశ్ లో ఒకేసారి రూ.7,880 కోట్లతో 16 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతోంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రూ.550 కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీని ఏకంగా 64 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఈ కాలేజీలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా నర్సింగ్ హాస్టళ్లను, యూజీ హాస్టళ్లను నిర్మిస్తున్నారు.
ఇక మరో వైద్య కళాశాల గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లి శివారులో నిర్మిస్తున్నారు. 50 ఎకరాల విస్తీర్ణంలో, రూ.500 కోట్ల వ్యయంతో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. వర్షాలు తగ్గడంతో నిర్మాణ పనులు 24 గంటలూ జరుగుతున్నాయి. మెడికల్ కాలేజీ నిర్మాణం ఇక్కడ పిల్లర్ల స్థాయికి చేరింది. వైఎస్సార్ జిల్లా పులివెందులలో 50 ఎకరాల విస్తీర్ణంలో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. రూ.500 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. పిల్లర్ల పై స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి.
విశాఖ జిల్లా పాడేరులో 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్ల వ్యయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా పునాది దాటి పిల్లర్ స్థాయిలో పనులు సాగుతున్నాయి. ఈ మెడికల్ కళాశాలల ద్వారా కొత్తగా 1,800 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నట్లు ఏపీఎంఎస్‌ఐడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఇక్కడి మెడికల్ కాలేజీ సకల సౌకర్యాలతో నిర్మాణం చేసి, రోగులకు, వైద్యులకు, వైద్యేతర సిబ్బందికి అనుకూలంగా ఉండేలా సౌకర్యాలు కల్పిస్తారు. ఓపీడీ, ఐపీడీతో పాటు 24 గంటలూ అక్యూట్ కేర్ బ్లాక్, ఐసీయూ, ఎన్‌ఐసీయూ, ఎంఐసీయూ, ఎస్‌ఐసీయూ వార్డులు ఉంటాయి. ప్రతి వైద్య కళాశాలలో లైబ్రరీ, లెక్చర్ గ్యాలరీ (ఏసీ), క్రీడా మైదానం వైద్య విద్యార్థులకు హాస్టళ్లు, స్టాఫ్ క్వార్టర్స్, వర్కింగ్ నర్స్ క్వార్టర్లు నిర్మిస్తున్నారు.
కాలేజీలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజీ కాలువలు సీసీటీవీ, లాన్, వైద్య సేవలు అవసరమైనప్పుడు నర్సులకు ఫోన్ చేసే విధానం (నర్స్ కాల్ సిస్టం) యాక్సెస్ కంట్రోల్ సిస్టం, అత్యాధునిక వసతులతో కూడిన ఆపరేషన్ థియేటర్లు, ఓపీడీ కన్సల్టేషన్ గదులు నిర్మిస్తున్నారు. ప్రతి వైద్య కళాశాలలో కనిష్టంగా 100, గరిష్టంగా 150 ఎంబీబీఎస్ సీట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.దిశా, మెడిసిన్ స్టోర్, మార్చురీ, లాండ్రీ, బయో మెడికల్ వేస్ట్, క్యాంటీన్, అటెండర్లకు ప్రత్యేక వసతి కేంద్రీకృత వేడి నీటి వసతి (సెంట్రలైజ్డ్ హాట్ వాటర్ సిస్టం) కల్పిస్తున్నారు. ప్రతి బెడ్‌కూ ఆక్సిజన్ పైప్‌లైన్. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఆర్‌ఓ ప్లాంటు, అగ్నిమాపక విభాగం ఉంటుంది.