మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: బుధవారం, 1 డిశెంబరు 2021 (22:58 IST)

తిరుమల ఘాట్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. లేకుంటే?

తిరుమల రెండవ ఘాట్ రోడ్డును ఉన్నట్లుండి టిటిడి మూసి వేయడానికి ప్రధాన కారణం ఉంది. ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతోనే అందరూ అనుకున్నారు. కానీ పెద్ద బండరాయి ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపైకి పడడంతో రోడ్డు మొత్తం చీలిపోయింది. అంతేకాదు ఆ ఫోర్స్‌కు రక్షణగా పెట్టిన ఇనుప కమ్మీలు కూడా కొట్టుకుపోయాయి. 

 
అది కూడా మోకాళ్ళమిట్టకు అతి సమీపంలో. తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఏడుగురు ప్రయాణీకులతో ఒక జీపు వెళుతోంది. ఉన్నట్లుండి పెద్ద శబ్ధంతో బండరాయి కిందకు పడింది. అదృష్టవశాత్తు జీపుపై అది పడలేదు. వెంట్రుకవాసి దూరంలో ప్రయాణీకులు తప్పించుకున్నారు.

 
జీపు కాస్త ముందుకు వెళ్ళిన వెంటనే రోడ్డు మొత్తం కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో భక్తులకు ఎవరికీ గాయాలు కాలేదు. అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అంతేకాకుండా ఒక ఆర్టీసీ బస్సు డ్రైవర్ కూడా అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును కూడా ఆపేసి వెనక్కి వెళ్లిపోయాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రస్తుతానికి మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలను కొనసాగిస్తున్నారు. 

 
రెండవ ఘాట్ రోడ్డును మరమ్మత్తులు చేయాలంటే ఖచ్చితంగా వారానికిపైగా సమయం పడుతుందని టిటిడి అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలు పడి ఆగిన తరువాత కొండ చరియలు చెమ్మగిల్లి ఆ తరువాత కొండచరియలు విరిగిపడుతున్నాయని టిటిడి అధికారులు భావిస్తున్నారు.