ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు.. 15మంది మృతి.. నిరాశ్రయులుగా 4.48 లక్షల మంది
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడు జిల్లాల్లో 4.48 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షం సంబంధిత ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మొత్తం 19 బృందాలు, రాష్ట్ర ఎస్డీఆర్‌ఎఫ్ 20 బృందాలు ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్ల కోసం బరిలోకి దిగాయి.
ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టేందుకు రెండు హెలికాప్టర్లను ఏర్పాటు చేయాలని నేవీ అధికారులను అభ్యర్థించారు. ఇప్పటికే ఒక హెలికాప్టర్ విజయవాడకు చేరుకుంది. చిక్కుకుపోయిన వ్యక్తులను విమానంలో తరలించడానికి, ఆహార పదార్థాలను అందజేసేందుకు.. హెలికాఫ్టర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.
విజయవాడలో ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 80 బోట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. కాకినాడ, ఏలూరు, ప్రకాశం ప్రాంతాల నుంచి మరో 39 బోట్లు విజయవాడకు వెళ్తున్నాయి.
సహాయక చర్యల కోసం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో మరో 64 బోట్లను ఏర్పాటు చేశారు. విజయవాడ నగరంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు సహా ఎన్టీఆర్ జిల్లాలో ఏడుగురు మరణించారు. గుంటూరు జిల్లాలో ఐదుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలో నీట మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. 20 జిల్లాల్లో 1.51 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి.