శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 15 మే 2023 (14:12 IST)

చంద్రబాబు - నారాయణ ఆస్తుల జప్తునకు జీవో జారీ చేసిన జగన్ సర్కారు

chandrababu
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి పి.నారాయణకు చెందిన ఆస్తులను జప్తు చేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి సర్కారు మరో నల్ల జీవోను తీసుకొచ్చింది. గతంలో జగన్ సర్కారు జారీ చేసిన జీవో నంబర్ ఒకటిని కొట్టివేసిన కొన్ని గంటల్లోనే మరో బ్రిటీష్ కాలం నాటి చట్టాలన్ని తెరపైకి తెచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా జీవో నంబర్ 89, 90లను విడుదల చేసింది. ఉద్దేశపూర్వకంగానే 1944 ఆర్డినెన్స్‌లో సెక్షన్‌ను పూర్తిగా విస్మరించి ఈ జీవోలను రిలీజ్ చేసింది. 
 
ఇందులోభాగంగా, విజయవాడకు సమీపంలోని ఉండవల్లి కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వం అటాచ్‌ చేసింది. కొన్నేళ్లుగా తెదేపా అధినేత చంద్రబాబు లింగమనేని గెస్ట్‌ హౌస్‌లో అద్దెకు ఉంటున్నారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ అభియోగం మోపింది. క్విడ్‌ ప్రోకోకు పాల్పడ్డారని ఆస్తుల జప్తునకు సీఐడీ ఆదేశాలు జారీ చేసింది.
 
స్థానిక ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సమాచారం ఇచ్చి కరకట్ట పక్కన ఉన్న లింగమనేని గెస్ట్‌హౌస్‌ జప్తునకు అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. దీన్ని తెలుగుదేశం పార్టీనేతలు తప్పుబడుతున్నారు. ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. వైకాపా ఎన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.