రైతు సమస్యలను ఎత్తి చూపుతూ చంద్రబాబు పోరుబాట
టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం పాదయాత్ర చేయనున్నారు. అకాల వర్షాల వల్ల దెబ్బ తిన్న రైతుల సమస్యను ఎత్తిచూపడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి చేపట్టిన దశలవారీ ఉద్యమంలో భాగంగా ఆయన గోదావరి జిల్లాల్లోని తణుకు నియోజకవర్గంలో 12 కిలోమీటర్ల దూరం ఈ యాత్ర చేయనున్నారు. పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి ఆయన ఈ యాత్ర నిర్వహిస్తారు. దీనికి రైతు పోరుబాట అని పేరు పెట్టారు.
తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం గ్రామం నుంచి ఈ యాత్ర ఉదయం 8 గంటలకే ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 11 గంటలకు గోటేరు గ్రామం వద్ద ఆపుతున్నారు. చల్లబడిన తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి పాదయాత్ర ప్రారంభిస్తారు. తణుకు పట్టణం వరకూ ఈ యాత్ర సాగుతుంది. తణుకు పట్టణంలో ఆకుల శ్రీరాములు డిగ్రీ కళాశాల వద్ద బహిరంగ సభ జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం చంద్రబాబు గురువారం సాయంత్రమే ఇక్కడ నుంచి ఇరగవరం బయలుదేరి వెళ్తున్నారు.
మరోవైపు, గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద నుంచి ఇప్పటికి రూ.1,400 కోట్ల విలువైన ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. ఇది 30 శాతానికి సమానం. ఇంకా 70 శాతం ధాన్యం రైతుల వద్దే మిగిలిపోయి ఉంది. కొనుగోలు చేసిన ధాన్యం బాపతు డబ్బులు కూడా ఇంకా రైతులకు చెల్లించలేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి దాసరి శ్యామ చంద్ర శేషు ఆరోపించారు.